
Donald Trump: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను 4 వారాల్లో కలుస్తా: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
చైనాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న ఈ సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. వచ్చే నాలుగు వారాలలో తాను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలవనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రధాన చర్చా అంశం సోయాబీన్ ఎగుమతులేనని ఆయన స్పష్టంచేశారు. ''మా దేశ రైతులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కారణం - చైనా అమెరికా సోయాబీన్ ఉత్పత్తిని కొనుగోలు చేయడం ఆపివేయడం. రైతులకు కొంత భరోసా కల్పించేందుకు మేము సుంకాల రూపంలో వసూలు చేస్తున్న నిధుల్లో కొంత భాగాన్ని వారికి అందజేస్తాం. ఇక నాలుగు వారాల్లో జిన్‌పింగ్‌తో జరగబోయే భేటీలో సోయాబీన్ ఎగుమతుల గురించి ప్రధానంగా చర్చించనున్నాను'' అని ట్రంప్ తన ట్రూత్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
వివరాలు
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం
అక్టోబర్ చివరివారంలో దక్షిణ కొరియాలో జరగబోయే ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (అపెక్)సదస్సుకు పలు దేశాధినేతలు హాజరు కానున్నారు. ఆ సదస్సు సందర్భంగా జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే యోచనలో ఉన్నానని ట్రంప్ ఇటీవల స్పష్టం చేశారు. అదేవిధంగా,వచ్చేఏడాది ఆరంభంలో చైనాలో పర్యటించనున్నట్టు కూడా ఆయన ముందే ప్రకటించారు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఈఏడాది ఆరంభంలోనే మొదలైన సంగతి తెలిసిందే. సుంకాలను పెంచుతూ ఇరుదేశాలు ఒకరిపై మరొకరు చర్యలు తీసుకున్నాయి. ఆతర్వాత చర్చల వలన పరిస్థితి కొంత శాంతించినప్పటికీ,అవకాశం దొరికినప్పుడల్లా ట్రంప్ బీజింగ్‌పై విమర్శలు కొనసాగించారు. తాజాగా రష్యా నుంచి చమురుకొనుగోలు చేస్తున్నందుకు భారత్,చైనా దేశాలపై అధిక సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్,నాటో దేశాలపై ట్రంప్ ఒత్తిడి తెచ్చిన విషయం కూడా గమనార్హం.