Trump: జొహన్నెస్‌బర్గ్ G20 సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు గైర్హాజరు?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల చివరిలో దక్షిణాఫ్రికాలో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశానికి తాను హాజరుకాబోవడం లేదని తెలిపారు. దక్షిణాఫ్రికా ఈ సమూహంలో ఉండాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశం నవంబర్ 22 నుంచి 23 వరకు జోహన్నెస్‌బర్గ్‌లో నిర్వహించనున్నారు. ఇది మొదటిసారి G20 నాయకుల సమావేశం ఆఫ్రికా ఖండంలో జరుగుతోంది. దక్షిణాఫ్రికా 2024 డిసెంబర్ 1న G20 అధ్యక్షత్వాన్ని స్వీకరించింది.
వివరాలు
2026 G20 సమావేశం తన గోల్ఫ్ క్లబ్‌లో నిర్వహించాలన్న ట్రంప్
అమెరికా బిజినెస్ ఫోరం మియామిలో మాట్లాడిన ట్రంప్,"నేను అక్కడికి వెళ్లను. దక్షిణాఫ్రికాలో G20 సమావేశం జరుగుతోంది. కానీ అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దక్షిణాఫ్రికా ఇక G20లో ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇదంతా వాళ్లకు ముందే చెప్పేసాను. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ఆ సమావేశానికి నేను హాజరుకాలేను." అని వ్యాఖ్యానించారు. అమెరికా దక్షిణాఫ్రికా తరువాత, 2025 డిసెంబర్ 1 నుంచి 2026 నవంబర్ 30 వరకు G20 అధ్యక్షత్వాన్ని చేపడుతుంది. ట్రంప్ ఇప్పటికే 2026 G20 సమావేశాన్ని మియామి దగ్గర తన గోల్ఫ్ క్లబ్‌లో నిర్వహించాలని సూచించారు. గతంలో భారతదేశం 2022 డిసెంబర్ నుంచి 2023 నవంబర్ వరకు G20 అధ్యక్షతన నిర్వహించింది.
వివరాలు
జొహ్రాన్ మమ్దానీని 'కమ్యునిస్టు భావజాలం కలిగిన నాయకుడు: ట్రంప్
2023 సెప్టెంబర్‌లో న్యూ ఢిల్లీ లో జరిగిన 18వ G20 శిఖరాగ్ర సమావేశానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరయ్యారు. G20లో మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ ఉన్నాయి. భారత్ అధ్యక్షతన ఆఫ్రికన్ యూనియన్‌ను శాశ్వత సభ్యునిగా చేర్చారు. తన ప్రసంగంలో ట్రంప్, దక్షిణాఫ్రికా నుంచి వలసలు పెరుగుతున్నాయని, కమ్యూనిస్టు పాలన నుంచి పారిపోతున్నవారికి మియామి ఒక సురక్షిత స్థలం అయ్యిందని కూడా వ్యాఖ్యానించారు. అలాగే న్యూయార్క్ నూతన మేయర్ గా ఎన్నికైన జొహ్రాన్ మమ్దానీని 'కమ్యునిస్టు భావజాలం కలిగిన నాయకుడు'గా విమర్శించారు.