LOADING...
Trump: ఇరాన్‌ యుద్ధం ముగిసింది.. ఉక్రెయిన్‌పై దృష్టి సారిస్తా: ట్రంప్
ఇరాన్‌ యుద్ధం ముగిసింది.. ఉక్రెయిన్‌పై దృష్టి సారిస్తా: ట్రంప్

Trump: ఇరాన్‌ యుద్ధం ముగిసింది.. ఉక్రెయిన్‌పై దృష్టి సారిస్తా: ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2026
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌కు సంబంధించిన యుద్ధం ఇక ముగిసిన అధ్యాయమని, ఇప్పుడు తన పూర్తి దృష్టి ఉక్రెయిన్‌ యుద్ధంపైనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనేందుకు తనవంతు ప్రయత్నాలన్నీ చేస్తానని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తర్వాత ఉక్రెయిన్‌ అంశం అంతర్జాతీయ చర్చల్లో వెనుకబడినా,తాజాగా ట్రంప్‌ మరోసారి దానిని ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌-లే-బేలో మంగళవారం జరిగిన జీ-7 కూటమి దేశాల సదస్సులో పాల్గొన్న ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్‌ విషయంలో ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదన్నారు. హర్మూజ్‌ జలసంధి మీదుగా చమురు రవాణా మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నందున, రష్యా చమురుపై మరోసారి కఠిన ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి రావచ్చని సంకేతాలిచ్చారు.

వివరాలు 

మోదీతో ట్రంప్‌ ఆత్మీయ పలకరింపు

సదస్సులో జరిగిన వర్కింగ్‌ సెషన్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ కూడా పాల్గొన్నారు. రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావాలని జీ-7 దేశాల నేతల్లో అధికశాతం అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌కు అన్ని విధాలుగా సహకారం కొనసాగించాలని నిర్ణయించారు. జీ-7 సదస్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్‌ ఆత్మీయంగా పలకరించారు. కరచాలనం చేసి భుజంపై తట్టి అభివాదం చేశారు. అధికారిక సమావేశం బుధవారం జరగనున్నప్పటికీ, సదస్సు ప్రారంభానికి ముందే ఇద్దరు నాయకులు స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. గత 16 నెలల్లో మోదీ,ట్రంప్‌ ముఖాముఖిగా కలవడం ఇదే తొలిసారి. సదస్సులో ప్రసంగించిన మోదీ.. ప్రపంచం దాత-స్వీకర్త విధానం నుంచి పరస్పర సహకారం, సమానత్వం ఆధారిత భాగస్వామ్యం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు.

వివరాలు 

హర్మూజ్‌ జలసంధి భద్రతపై మోదీ ఆందోళన

అంతర్జాతీయ సంబంధాల్లో విశ్వసనీయతకు మరింత ప్రాధాన్యం పెరిగిందని చెప్పారు. "వసుధైక కుటుంబకం" భారతదేశం నమ్మే మూల సిద్ధాంతమని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండేలా అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు. నావికులు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ విధులు నిర్వహించే పరిస్థితులు కల్పించాలని కోరారు. హర్మూజ్‌ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, అనేక మంది భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. సంకుచిత ప్రయోజనాల కోసం వాణిజ్యం, సాంకేతికతలను దుర్వినియోగం చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికత, సరఫరా వ్యవస్థలను ప్రపంచ శ్రేయస్సు కోసమే వినియోగించాలే తప్ప వాటిని ఆయుధాలుగా మార్చకూడదని స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

ఐరాస భద్రతామండలిలో భారత్‌కు స్లొవేకియా మద్దతు

ప్రపంచ వ్యవస్థను ఇక జీ-7 దేశాలు మాత్రమే నడిపే పరిస్థితి లేదని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ పేర్కొన్నారు. భారత్‌ వంటి దేశాలు అంతర్జాతీయ నిర్ణయాల్లో భాగస్వామ్యం కావడం మారుతున్న ప్రపంచ పరిస్థితులకు నిదర్శనమని అన్నారు. సదస్సు సందర్భంగా కార్నీ, బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌లతో మోదీ ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఫ్రాన్స్‌కు వెళ్లే ముందు స్లొవేకియాలో పర్యటించిన ప్రధాని మోదీ, ఆ దేశ అధ్యక్షుడు పీటర్‌ పెల్లెగ్రినితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు స్లొవేకియా మద్దతు ప్రకటించింది. అంతర్జాతీయ వేదికల్లో భారత్‌ మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించింది.

Advertisement