LOADING...
Donald Trump: కాల్పులతో ఆపలేరు.. యుద్ధంలో గెలుస్తామన్న ట్రంప్
కాల్పులతో ఆపలేరు.. యుద్ధంలో గెలుస్తామన్న ట్రంప్

Donald Trump: కాల్పులతో ఆపలేరు.. యుద్ధంలో గెలుస్తామన్న ట్రంప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2026
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి తమను ఏ విధంగానూ వెనక్కి తగ్గించదని, ఇరాన్ పై కొనసాగుతున్న యుద్ధంలో విజయం సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, కాల్పుల ఘటనకు ఇరాన్ యుద్ధంతో సంబంధం ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. దుండగుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారని, 31ఏళ్ల కోల్ టోమాస్ అలెన్ ఒంటరిగా ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం ఇచ్చారు.

వివరాలు

ప్రాణప్రాయం నుంచి తప్పించుకున్న అధికారి

అతడు పలు ఆయుధాలతో భద్రతా చెక్‌పాయింట్ వైపు దూసుకెళ్లి కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన సీక్రెట్ సర్వీస్ అధికారి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని తెలిపారు. ఈ ఘటనతో డిన్నర్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయినప్పటికీ భద్రతా వ్యవస్థలు వేగంగా స్పందించాయని ట్రంప్ ప్రశంసించారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు నిందితుడి ఉద్దేశ్యంపై విచారణ కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఇక మరోవైపు ఇరాన్‌తో శాంతి చర్చల కోసం పాకిస్థాన్కు వెళ్లాల్సిన అమెరికా ప్రతినిధుల పర్యటనను ట్రంప్ రద్దు చేశారు. చర్చలు ఫలప్రదంగా లేవని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

వివరాలు

ఇరాన్ నాయకత్వంపై విమర్శలు

"మనం బలమైన స్థితిలో ఉన్నాం. వారు మాట్లాడాలంటే వాళ్లే ముందుకు రావాలని వ్యాఖ్యానించారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో కూడా ట్రంప్ ఇరాన్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ దేశంలో అంతర్గత గందరగోళం నెలకొన్నదని, నిర్ణయాలు తీసుకునే స్థాయిలో స్పష్టత లేదని పేర్కొన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఫిబ్రవరి 28 ప్రారంభంతో ఈ యుద్ధం ప్రారంభమైందని, అప్పటి నుంచి ఇరాన్ ప్రతిదాడులతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని, ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయని పేర్కొన్నారు.

Advertisement