Trump: హర్మూజ్ జలసంధి మాదే.. అమెరికా భూభాగమంటూ మ్యాప్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ జలసంధిని 'అమెరికా నూతన భూభాగం'గా పేర్కొంటూ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఓ మ్యాప్‌ను పోస్టు చేశారు. ఇరాన్‌తో కుదిరిన 60 రోజుల అవగాహన ఒప్పందం గడువు ముగిసిన మరుసటి రోజే ట్రంప్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్మూజ్ జలసంధిని తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చామని ట్రంప్ తెలిపారు. నౌకా రవాణా కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సముద్రంలో ఏర్పాటు చేసిన మైన్‌లను పూర్తిగా తొలగించామని లేదా నిర్వీర్యం చేశామని వెల్లడించారు. అయితే ఇరాన్‌కు సంబంధించిన ఓడరేవులపై అమెరికా నావికాదళ దిగ్బంధం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
వివరాలు
బల్క్ క్యారియర్‌పై గుర్తుతెలియని ప్రొజెక్టైల్ దాడి
ప్రస్తుతం ఇరాన్‌తో ఎలాంటి చర్చలు జరగడం లేదని, భవిష్యత్తులోనూ చర్చలు జరిపే ఉద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు.
అయితే ట్రంప్ చేసిన ప్రకటనకు, హర్మూజ్ జలసంధిలో వాస్తవ పరిస్థితులకు మధ్య వ్యత్యాసం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అక్కడ నౌకల రాకపోకలు ఇంకా పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి రాలేదని పేర్కొంటున్నారు.
మంగళవారం కూడా ఓ బల్క్ క్యారియర్‌పై గుర్తుతెలియని ప్రొజెక్టైల్ దాడి జరిగినట్లు సమాచారం.
ఈ ఘటనలో పలువురు సిబ్బంది గాయపడ్డారు.
దీంతో హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఏజెన్సీ హెచ్చరించింది.
వివరాలు
తీవ్రస్థాయిలో స్పందించిన ఇరాన్
మరోవైపు ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్రస్థాయిలో స్పందించింది.
కేవలం సోషల్ మీడియాలో ఓ పోస్టు చేయడం ద్వారా హర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవచ్చని భావించడం పగటి కలేనని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కజెమ్ ఘరిబాబాది విమర్శించారు.
ఇరాన్ విధించిన షరతులు పూర్తిగా నెరవేరే వరకు జలసంధిని తెరిచే ప్రశ్నే లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఖర్ ఖలీబాఫ్ తేల్చిచెప్పారు.
దీంతో హర్మూజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.