Trump: ఇరాన్‌తో యుద్ధం ముగిసినట్లే.. ట్రంప్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా,ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు త్వరలో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌తో సైనిక ఘర్షణ దాదాపు ముగిసినట్లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్ ప్రధానితో సమావేశమైన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ సోమవారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం అనూహ్యంగా వైట్‌హౌస్ బ్రీఫింగ్ రూమ్‌కు వచ్చిన ట్రంప్ విలేకరులతో మాట్లాడారు.
వివరాలు
చర్చలు సాగితే భారీ దాడులు ఉండకపోవచ్చని సంకేతం
"సైనికంగా ఇరాన్ పని దాదాపు ముగిసింది. ప్రస్తుతం ఉన్న యథాతథ పరిస్థితిని కొనసాగిస్తాం" అని స్పష్టం చేశారు. అయితే, ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు దీర్ఘకాలిక పరిష్కారం అవసరమని ఆయన పేర్కొన్నారు.
సైనిక చర్యలకు బదులుగా ప్రస్తుత పరిస్థితినే కొనసాగించేందుకు గల్ఫ్ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ట్రంప్ వెల్లడించారు.
ఖతార్‌తో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని తెలిపారు.
హర్మూజ్ జలసంధిలో అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని కొనసాగించడమే ప్రస్తుతానికి సరైన మార్గంగా ఆయా దేశాలు భావిస్తున్నట్లు వివరించారు.
ఇరాన్‌తో చర్చలు సఫలమైతే ఆ దేశంపై భారీ స్థాయిలో దాడులు చేసే అవకాశం ఉండకపోవచ్చని ట్రంప్ సంకేతాలిచ్చారు.
వివారాలు
"లాక్ అండ్ లోడ్"తో సిద్ధం
అయితే, పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోతే మాత్రం వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు.
అవసరమైతే "లాక్ అండ్ లోడ్"తో సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.
దీంతో ఒకవైపు చర్చలకు అవకాశం ఇస్తూనే, మరోవైపు సైనికపరమైన సంసిద్ధతను కొనసాగిస్తామని ఆయన చెప్పినట్లయింది.
గత ఎనిమిది నెలలుగా అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ పరిణామాలపై ప్రభావం చూపుతున్నాయి.
ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడానికి ఈ పరిస్థితులు కూడా కారణమయ్యాయి.
ఇటీవల జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమికి ఈ ఉద్రిక్తతలు ఒక కారణంగా నిలిచాయని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇరాన్‌తో ఘర్షణలను తగ్గించే దిశగా ట్రంప్ చేసిన తాజా ప్రకటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.