
Donald Trump: చైనీస్ విద్యార్థులపై ట్రంప్ యూటర్న్.. అమెరికాలోకి 6 లక్షల మందికి ఆహ్వానం
ఈ వార్తాకథనం ఏంటి
చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శిస్తున్న వైఖరి గందరగోళానికి గురి చేస్తోంది. ఒకవైపు బీజింగ్‌పై టారిఫ్‌ల పేరుతో హెచ్చరికలు జారీ చేస్తూ వాణిజ్య పోరాటానికి రంగం సిద్ధం చేస్తున్న ఆయన, మరోవైపు చైనాకు చెందిన విద్యార్థులకు అమెరికా విద్యాసంస్థల తలుపులు విస్తృతంగా తెరిచారు. మొత్తం ఆరు లక్షలమందికి పైగా చైనీస్ విద్యార్థులను ఆహ్వానించేందుకు ట్రంప్ ముందుకొచ్చారు. ఈ తీరుతో ఆయన సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వలసదారులు, అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటూ వచ్చారని తెలిసిందే. ముఖ్యంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీతో అనుబంధం ఉన్నవారికి, పరిశోధన రంగంలో పనిచేస్తున్న విద్యార్థులకు వీసాలు రద్దు చేస్తామని ఆయన ముందుగానే హెచ్చరించారు.
వివరాలు
అమెరికా విశ్వవిద్యాలయాల్లో 2.70 లక్షల మంది చైనీస్ విద్యార్థులు
భారత్ సహా ఇతర దేశాల విద్యార్థుల వీసా ప్రక్రియను కూడా కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లోనే ట్రంప్ చైనీస్ విద్యార్థుల విషయంలో ఇప్పుడు తీసుకున్న యూటర్న్ విశేషంగా నిలిచింది. ఇటీవల వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''చైనీస్ విద్యార్థులను అమెరికాలోకి రానివ్వబోమనే వార్తలు వస్తున్నాయి.కానీ నిజానికి మేము వారికి మన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించాలని భావిస్తున్నాం. ఇది మనకూ అవసరమే. దాదాపు ఆరు లక్షలమంది చైనా విద్యార్థులకు అనుమతి ఇస్తాం. ఆ దేశంతో విద్యా సంబంధాలు, పరస్పర సహకారం పెంపొందించుకోవాలని మేం కోరుకుంటున్నాం'' అని ఆయన వివరించారు. ప్రస్తుతం అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే దాదాపు 2.70 లక్షల మంది చైనీస్ విద్యార్థులు చదువుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
వివరాలు
ఇది 'అమెరికా ఫస్ట్' సిద్ధాంతానికి విరుద్ధం కాదా?: మాగా
అయితే ట్రంప్ తాజా నిర్ణయం రాజకీయ వివాదాలకు దారితీసింది. ఆయన తీసుకున్న ఈ చర్యను సొంత పార్టీ నాయకులే కాకుండా 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' (మాగా) మద్దతుదారులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా విద్యార్థులకు రావాల్సిన అవకాశాలను ఎందుకు చైనీయులకు ఇస్తున్నారు? ఇది 'అమెరికా ఫస్ట్' సిద్ధాంతానికి విరుద్ధం కాదా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అధ్యక్షుడి బృందం మాత్రం ట్రంప్ నిర్ణయానికి మద్దతు ఇస్తోంది. ''చైనీస్ విద్యార్థులను నిరాకరిస్తే అమెరికాలోని దాదాపు 15 శాతం యూనివర్సిటీలు పనితీరును కొనసాగించలేవు. దేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు'' అని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ స్పష్టంచేశారు.