Page Loader
Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం 
డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం..'టేక్ ఇట్ డౌన్' కి ఆమోదం

Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2025
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో డీప్‌ఫేక్‌లు,రివెంజ్ పోర్న్‌లను అదుపు చేసేందుకు కీలకమైన చర్య తీసుకున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ప్రమాదకర డిజిటల్ దుర్వినియోగాలను నియంత్రించేందుకు రూపొందించిన ప్రత్యేక చట్టంపై ఆయన సంతకం చేశారు. ఈ కొత్త చట్టానికి 'టేక్ ఇట్ డౌన్ యాక్ట్' అనే పేరు పెట్టారు.ఈ చట్టం ప్రకారం,ఎవరి అనుమతి లేకుండా ఏదైనా వ్యక్తికి సంబంధించిన ఎఐ(AI) ఆధారిత అశ్లీల చిత్రం ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తే, ఆయా టెక్ కంపెనీలు ఆ కంటెంట్‌ను 48 గంటల వ్యవధిలోపే తొలగించాల్సిన బాధ్యత వహించాల్సి ఉంటుంది. అమెరికా భవిష్యత్తు, మన కుటుంబాల రక్షణ, పిల్లల భద్రత కోసం ఈ చట్టం ఎంతో అవసరమని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ స్పష్టం చేశారు.

వివరాలు 

 ఉల్లంఘించే వారికి జైలు శిక్ష,జరిమానా 

వైట్ హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రంప్ ఈ చట్టంపై సంతకం చేశారు. ఈ వేడుకలో ఆయనతో పాటు మెలానియా ట్రంప్ కూడా హాజరయ్యారు.ఈ చట్టం ప్రకారం,రివెంజ్ పోర్న్గా పిలవబడే, నిబంధనలకు విరుద్ధంగా రూపొందించిన డీప్‌ఫేక్ కంటెంట్‌ను ప్రచురించడం ఇకపై చట్టానికి వ్యతిరేకమైన చర్యగా పరిగణించబడుతుంది. దీనిని ఉల్లంఘించే వారు జైలు శిక్ష,జరిమానా లేదా రెండు శిక్షలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ బిల్లుకు కాంగ్రెస్లోని రెండు పార్టీల నుండి కూడా మద్దతు లభించింది.ఏప్రిల్ నెలలో ఇది ప్రతినిధుల సభలో ఆమోదం పొందింది. ఈ చట్టాన్నిసెనేట్ కామర్స్ కమిటీ చైర్మన్ టెడ్ క్రూజ్ రచించారు.డెమోక్రటిక్ సెనేటర్ అమీ క్లోబుచార్ ఈ ప్రయత్నంలో ఆయనతో కలిసిరాజకీయ భేదాలు మరిచి మద్దతుగా నిలిచారు.

వివరాలు 

డీప్‌ఫేక్ అంటే ఏమిటి? 

డీప్‌ఫేక్ అనేది ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా రూపొందించబడే వీడియోలు లేదా ఫోటోలు. ఇందులో ఇతర వ్యక్తుల ముఖాలు, శరీర లక్షణాలను మార్ఫింగ్ చేసి వేరే దృశ్యాలపై అతికించి, అసలైనట్టు నమ్మేలా చిత్రీకరిస్తారు. ముఖ్యంగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని, అశ్లీల చిత్రాలు, వీడియోలతో మిళితం చేస్తూ అన్యాయంగా ఉపయోగించబడుతోంది.