Loading...
Trump: పిల్లల వ్యాక్సిన్‌ విధానంలో ట్రంప్‌ మార్పులు.. అమెరికాలో గందరగోళం
పిల్లల వ్యాక్సిన్‌ విధానంలో ట్రంప్‌ మార్పులు.. అమెరికాలో గందరగోళం

Trump: పిల్లల వ్యాక్సిన్‌ విధానంలో ట్రంప్‌ మార్పులు.. అమెరికాలో గందరగోళం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

భారీగా సుంకాలు విధించడం,ఇరాన్‌తో యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలు సహా పలు చర్యలతో అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ల సిఫార్సులు,టీకాల షెడ్యూళ్లలో మార్పులు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పులు చిన్నారుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు అమెరికాలో పిల్లలకు అవసరమైన కొన్ని టీకాలను కలిపి ఒకేసారి ఇచ్చే విధానం అమల్లో ఉంది. దీంతో ప్రతి వ్యాక్సిన్‌ కోసం పిల్లలను పదేపదే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే ట్రంప్‌ ప్రతిపాదించిన కొత్త విధానంలో టీకాలను వేర్వేరు విభాగాలుగా విభజించారు.

వివరాలు 

అందరికీ అవసరమైనవి.. ముప్పు ఉన్నవారికే కొన్ని

ఫలితంగా పిల్లలకు అవసరమైన అన్ని టీకాలు ఇప్పించాలంటే ఆసుపత్రికి పలుమార్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

కొత్త విధానం ప్రకారం తట్టు, గవద బిళ్లలు, రుబెల్లా, డిఫ్తీరియా, టెటానస్, పెర్టుసిస్, పోలియో, హిబ్, న్యూమోకోకల్‌ వ్యాధి, హెచ్‌పీవీ, ఆటలమ్మ వంటి వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్లను అందరికీ ఇవ్వాలని సూచించారు.

అయితే హెపటైటిస్‌-ఎ, హెపటైటిస్‌-బి, ఆర్‌ఎస్‌వీ, మెనింజోకోకల్‌ వ్యాధికి సంబంధించిన టీకాలను మాత్రం ఆయా వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉన్న పిల్లలకు మాత్రమే అందించాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

వివరాలు 

ఎంఎంఆర్‌ టీకా ఇక మూడు వేర్వేరు షాట్లుగా..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు తట్టు, గవద బిళ్లలు, రుబెల్లా వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు ఎంఎంఆర్‌ వ్యాక్సిన్‌ను ఒకే షాట్‌గా ఇస్తున్నారు.

అయితే ఈ మూడు వ్యాధులకు సంబంధించిన టీకాలను విడివిడిగా ఇవ్వాలని ట్రంప్‌ తాజాగా ఆదేశించారు.

అయితే ఎంఎంఆర్‌లోని మూడు టీకాలు ప్రత్యేకంగా అమెరికా మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో లేవు.

వాటిని విడివిడిగా అందుబాటులోకి తీసుకురావడానికి 90 రోజుల గడువు ఇస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

ADVERTISEMENT

వివరాలు 

వైద్య నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత

ఎంఎంఆర్‌ వ్యాక్సిన్‌పై ట్రంప్‌ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడు వ్యాధులకు ఒకేసారి టీకా ఇవ్వడం ప్రాణాంతకమని ఆయన పేర్కొన్నారు.

అయితే ట్రంప్‌ వ్యాఖ్యలకు శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్య నిపుణులు అప్పట్లోనే ఖండించారు.

అయినప్పటికీ ఆయన తన వైఖరిని మార్చుకోకుండా తాజాగా ఎంఎంఆర్‌ టీకాలను విడదీసే నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారితీస్తోంది.

అమెరికాలో టీకాలు తీసుకునే వారి శాతం క్రమంగా తగ్గుతున్న సమయంలోనే తట్టు వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది.

ఈ పరిస్థితుల్లో ట్రంప్‌ తీసుకున్న తాజా నిర్ణయం తల్లిదండ్రుల్లో మరింత భయాందోళన, గందరగోళానికి కారణమయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

వైద్య నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత

పిల్లలకు ఏ టీకా ఎప్పుడు ఇవ్వాలన్న విషయంలో స్పష్టత తగ్గితే టీకాలు తీసుకునే వారి సంఖ్య మరింత పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో టీకాలపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసిన అమెరికా ప్రస్తుత ఆరోగ్య మంత్రి రాబర్ట్‌ ఎఫ్‌. కెనడీ జూనియర్‌ అభిప్రాయాల ప్రభావం కూడా తాజా నిర్ణయాలపై ఉందనే చర్చ జరుగుతోంది.

ఆయన అభీష్టం మేరకే టీకాల విషయంలో ట్రంప్‌ ప్రస్తుత ఆదేశాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT