LOADING...
Netflix-Warner Bros: వార్నర్ బ్రదర్స్ డీల్‌లో ట్విస్ట్.. రంగంలోకి ట్రంప్ అల్లుడు
రంగంలోకి ట్రంప్ అల్లుడు

Netflix-Warner Bros: వార్నర్ బ్రదర్స్ డీల్‌లో ట్విస్ట్.. రంగంలోకి ట్రంప్ అల్లుడు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2025
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

నెట్‌ ఫ్లిక్స్‌ - వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మధ్య కుదిరిన ఒప్పందానికి అడ్డంకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విలీన వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రభుత్వంతో సన్నిహితంగా సంబంధాలు ఉన్న పారామౌంట్ స్కైడ్యాన్స్ సంస్థ.. వార్నర్ బ్రదర్స్‌ను దక్కించుకునేందుకు భారీగా 108.4 బిలియన్ డాలర్ల హాస్టైల్ బిడ్ను పెట్టింది. ఈ బిడ్డింగ్‌కు అధ్యక్షుడి అల్లుడు జేర్డ్ కుష్నర్ మద్దతు ఉన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదిక వెల్లడించింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన టీవీ ఛానళ్లు, సినిమా స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాలను కొనుగోలు చేయడానికి నెట్‌ఫ్లిక్స్‌, కామ్‌కాస్ట్ కార్పొరేషన్, పారామౌంట్ సంస్థల మధ్య కొన్ని వారాలుగా పోటీ కొనసాగుతోంది.

వివరాలు 

విక్రయ ప్రక్రియపై పారామౌంట్ అభ్యంతరం 

ఈ బిడ్డింగ్ యుద్ధంలో చివరికి డిస్కవరీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వైపే మొగ్గు చూపింది. సుమారు 72 బిలియన్ డాలర్లు (అంటే దాదాపు రూ. 6.48 లక్షల కోట్లు) విలువైన ఒప్పందంతో వార్నర్ బ్రదర్స్‌ను కొనుగోలు చేసేందుకు అంగీకారం కుదిరింది. అయితే ఈ ఒప్పందాన్ని సవివరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ట్రంప్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ పరిణామాల మధ్య విక్రయ ప్రక్రియపై పారామౌంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వార్నర్ బ్రదర్స్‌ను సొంతం చేసుకునేందుకు ఆ సంస్థ సెప్టెంబర్ నుంచే ప్రతిపాదనలు చేస్తూ వస్తున్నప్పటికీ అవన్నీ తిరస్కరణకు గురయ్యాయి. దీంతో తాజాగా 108.4 బిలియన్ డాలర్ల భారీ హాస్టైల్ బిడ్ను దాఖలు చేసింది. ఒక్కో షేరుకు 30 డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.

వివరాలు 

వార్నర్ బ్రదర్స్‌ మిగిలిన వ్యాపార విభాగాలన్నీ కూడా ఈ ఒప్పందంలో భాగమవనున్నాయి

సాధారణంగా మేనేజ్‌మెంట్ ఒప్పందాన్ని వ్యతిరేకించినప్పుడు,నేరుగా వాటాదారులనే లక్ష్యంగా చేసుకుని ఈ తరహా హాస్టైల్ బిడ్లు వేస్తారు. అలాగే ప్రతిపాదిత మొత్తాన్ని పూర్తిగా నగదు రూపంలోనే చెల్లిస్తామని పారామౌంట్ స్పష్టం చేసింది. ఈ డీల్ అమలైతే, వార్నర్ బ్రదర్స్‌కు చెందిన మిగిలిన వ్యాపార విభాగాలన్నీ కూడా ఈ ఒప్పందంలో భాగమవనున్నాయి. ఈ బిడ్ వెనుక జేర్డ్ కుష్నర్ నేతృత్వంలోని అఫినిటీ పార్టనర్స్ సంస్థ ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా పారామౌంట్ వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఈ పరిణామాలన్నీ మీడియా దిగ్గజంగా ఎదగాలని భావిస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఆశలకు గండికొడుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఒక్కో షేరుకు 28 డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది.

Advertisement