Donald Trump: క్యాపిటల్ హిల్‌పై దాడి ప్రసంగం.. బీబీసీపై ట్రంప్ 10 బిలియన్ డాలర్ల దావా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన ప్రసంగాన్ని మార్చి చూపించిన డాక్యుమెంటరీ కారణంగా బ్రిటన్‌కు చెందిన బీబీసీపై భారీ దావా వేశారు. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ వద్ద జరిగిన అల్లర్లకు ముందు తన మద్దతుదారులకు చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేసి వక్రీకరించారని ఆరోపిస్తూ, కనీసం 10 బిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ సోమవారం మయామీలోని ఫెడరల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో బీబీసీపై రెండు ప్రధాన ఆరోపణలు చేశారు ట్రంప్. పరువునష్టం (డిఫమేషన్)తో పాటు ఫ్లోరిడా డిసెప్టివ్ అండ్ అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చట్టాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఈ రెండు అంశాలకు గాను ఒక్కో అంశానికి కనీసం 5బిలియన్ డాలర్ల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
వివరాలు
రెండు వేర్వేరు భాగాలను కలిపి చూపారని ఆరోపణ
ఈ దావా వేయబోతున్నట్లు ట్రంప్ సోమవారం ప్రకటించారు. బీబీసీ తన మాటలను మార్చేసిందని, "నేను చెప్పని మాటలను కూడా చెప్పినట్లు చూపించారు. దీనికోసం ఏఐను కూడా వాడి ఉండొచ్చు" అంటూ ట్రంప్ మండిపడ్డారు. ఈ వివాదాస్పద డాక్యుమెంటరీ గత ఏడాది, 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు, బీబీసీ ప్రధాన కరెంట్ అఫైర్స్ కార్యక్రమమైన 'పనోరమా'లో ప్రసారమైంది. డాక్యుమెంటరీలో ట్రంప్ 2021 జనవరి 6న చేసిన ప్రసంగంలోని రెండు వేర్వేరు భాగాలను కలిపి చూపారని ఆరోపణ. ఆ ఎడిటింగ్ వల్ల, జో బైడెన్ 2020 ఎన్నికల విజయం ధృవీకరణ జరుగుతున్న సమయంలో, క్యాపిటల్‌పై దాడి చేయమని ట్రంప్ నేరుగా పిలుపునిచ్చినట్టుగా కనిపించిందని ట్రంప్ వర్గం చెబుతోంది.
వివరాలు
బీబీసీ డైరెక్టర్ జనరల్‌తో పాటు సంస్థలోని అగ్ర న్యూస్ అధికారి రాజీనామా
ట్రంప్ లీగల్ టీం ప్రతినిధి ఒక ప్రకటనలో మాట్లాడుతూ, "ఒకప్పుడు గౌరవంగా ఉన్నబీబీసీ ఇప్పుడు పరువు పోయిన సంస్థగా మారింది.2024 అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలనే ఉద్దేశంతో ట్రంప్ ప్రసంగాన్ని కావాలనే వక్రీకరించి,మోసపూరితంగా ప్రసారం చేసింది"అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌పై కథనాల విషయంలో బీబీసీకి ఎప్పటి నుంచో ఒక పక్షపాతధోరణి ఉందని కూడా ఆ ప్రకటనలో ఆరోపించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కలిగిన బీబీసీ,ఈ వివాదంతో గత నెల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఎడిట్ చేసిన వీడియోపై మళ్లీ దృష్టి వెళ్లడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారం కారణంగా బీబీసీ డైరెక్టర్ జనరల్‌తో పాటు సంస్థలోని అగ్ర న్యూస్ అధికారి రాజీనామా చేయాల్సి వచ్చింది.
వివరాలు
ట్రంప్‌కు క్షమాపణ లేఖ పంపిన బీబీసీ చైర్మన్ సమీర్ షా
ట్రంప్ దావాలో, 2024 అధ్యక్ష ఎన్నికలకు కేవలం వారం ముందు ఈ ఎడిట్ చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేసి, ఎన్నికల ఫలితాలను తనకు నష్టం కలిగేలా ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో బీబీసీ వ్యవహరించిందని స్పష్టంగా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీబీసీ ఖండిస్తోంది. చట్టపరమైన పరువునష్టం జరగలేదని సంస్థ చెబుతున్నప్పటికీ, బీబీసీ చైర్మన్ సమీర్ షా మాత్రం ట్రంప్‌కు క్షమాపణ లేఖ పంపించారు. అదే సమయంలో, ఈ విషయం అంతర్గత మెమోలో బయటపడిన వెంటనే బీబీసీ త్వరగా స్పందించి ఉండాల్సిందని సమీర్ షా బ్రిటన్ పార్లమెంట్ కమిటీ ఎదుట అంగీకరించారు.
వివరాలు
మెమో 'డైలీ టెలిగ్రాఫ్' పత్రికకు లీక్
ఆ మెమో 'డైలీ టెలిగ్రాఫ్' పత్రికకు లీక్ కావడంతో విషయం పెద్ద దుమారంగా మారింది. మీడియా సంస్థలపై ట్రంప్ వేసిన కేసుల జాబితాలో ఇది తాజా కేసు. గత కొన్ని ఏళ్లలో కూడా పలు మీడియా సంస్థలపై ఆయన చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. వాటిలో కొన్ని కేసులు మల్టీ మిలియన్ డాలర్ల సెటిల్‌మెంట్లతో ముగిసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి.