Trump: త్వరలో ఒప్పందం కుదరకపోతే విధ్వంసమే : ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. వీలైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకుని హర్మూజ్ జలసంధిని తిరిగి ప్రారంభించాలని ఆయన సూచించారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఒప్పందం త్వరగా జరగకపోతే, ఇరాన్‌లోని కీలక మౌలిక వసతులపై దాడులు జరిగే అవకాశముందని ట్రంప్ పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు నిల్వలు, అలాగే ఖర్గ్ ద్వీపం వంటి ప్రధాన ప్రాంతాలు లక్ష్యంగా మారవచ్చని హెచ్చరించారు. ఈ అంశంపై ఆయన ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు.
వివరాలు
హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే..
అమెరికా ప్రస్తుతం ఇరాన్‌తో ఉన్న సైనిక ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ చర్చల్లో కొంత పురోగతి సాధించినప్పటికీ,తుది ఒప్పందం త్వరలో కుదరాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, ఏవైనా కారణాలతో ఒప్పందం ఆలస్యమైతే లేదా హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే, ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, చమురు క్షేత్రాలు, ఖర్గ్ ద్వీపం,డీశాలినేషన్ ప్లాంట్లు వంటి ముఖ్యమైన నిర్మాణాలపై భారీ దాడులు జరిగే అవకాశం ఉందని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇది కేవలం వ్యూహాత్మక చర్య మాత్రమే కాకుండా, గత 47 ఏళ్లలో ఇరాన్ చర్యల కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ సైనికులు,ఇతరుల తరఫున ప్రతీకారంగా కూడా ఈ చర్యలు తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు.