Trump: ఇరాన్ ప్రతిపాదనపై ట్రంప్ అసంతృప్తి.. అనిశ్చితిలో అణు చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇచ్చిన కొత్త ప్రతిపాదనపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని మళ్లీ తెరవాలని ఇరాన్ సూచించినా, ముందుగా అమెరికా ఆంక్షలు ఎత్తివేసి, విభేదాలను ముగించాలనే షరతు పెట్టింది. అయితే ఈ ప్రతిపాదన ట్రంప్‌కు పెద్దగా నచ్చలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా ఇరాన్ ప్రణాళికపై సందేహాలు వ్యక్తం చేశారు. జలసంధి తెరవడమంటే తమ అనుమతి తీసుకుని ఫీజులు చెల్లించాలన్న ఇరాన్ అర్థం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ జలమార్గాలపై ఎవరికీ ప్రత్యేక అధికారం ఉండదని స్పష్టం చేశారు.
వివరాలు
అణు కార్యక్రమం లేకుండా ఎలాంటి ఒప్పందానికీ అమెరికా ఒప్పుకోదు: రుబియో
అమెరికా లక్ష్యం ఇరాన్ అణ్వాయుధాలు సాధించకుండా అడ్డుకోవడమేనని ట్రంప్ ప్రభుత్వం పలుమార్లు తెలిపింది. అణు కార్యక్రమం లేకుండా ఎలాంటి ఒప్పందానికీ అమెరికా ఒప్పుకోదని రుబియో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గత వీకెండ్‌లో జరగాల్సిన శాంతి చర్చలను ట్రంప్ రద్దు చేశారు. పాకిస్తాన్‌లో ఇరాన్ ప్రతినిధులతో సమావేశం ప్లాన్ కూడా నిలిపివేశారు. ఇదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి ఇస్లామాబాద్ వెళ్లినా, పాకిస్తాన్ అధికారులతో మాత్రమే భేటీ అయ్యారు.
వివరాలు
మూడు షరతులు విధించిన ఇరాన్
హోర్ముజ్ జలసంధి తెరవాలంటే మూడు షరతులు పెట్టింది ఇరాన్. అమెరికా ఆంక్షలు ఎత్తివేయడం, మధ్యప్రాచ్యంలో శత్రుత్వం ఆపడం, అణు కార్యక్రమంపై చర్చలు వాయిదా వేయడం ఇందులో ఉన్నాయి. 2015లో ఇరాన్‌తో అమెరికా సహా పలు దేశాలు అణు ఒప్పందం చేసుకున్నప్పటికీ, ట్రంప్ తన మొదటి పదవీకాలంలో దాన్నుంచి బయటకు రావడంతో ఆ ఒప్పందం నిలిచిపోయింది.