LOADING...
West Asia conflict: హర్మూజ్‌ రక్షణపై చైనాకు ట్రంప్‌ పిలుపు.. సైనిక చర్యలు ఆపాలని బీజింగ్‌ కీలక వ్యాఖ్యలు
సైనిక చర్యలు ఆపాలని బీజింగ్‌ కీలక వ్యాఖ్యలు

West Asia conflict: హర్మూజ్‌ రక్షణపై చైనాకు ట్రంప్‌ పిలుపు.. సైనిక చర్యలు ఆపాలని బీజింగ్‌ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 16, 2026
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ యుద్ధం ప్రభావంతో హర్మూజ్‌ జలసంధి భద్రత దెబ్బతినడంతో, అక్కడ ఇంధన రవాణా అంతరాయం లేకుండా కొనసాగేందుకు పలు దేశాలు ముందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు. ఈ అంశంపై చైనా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. హర్మూజ్‌ భద్రత కోసం తాము పాత్ర పోషించాలంటే, పశ్చిమాసియాలో కొనసాగుతున్న సైనిక చర్యలను వెంటనే నిలిపివేయాలని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్‌ జియాన్‌ ఇరుపక్షాలకు సూచించారు. ఈ ఘర్షణల కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరా, ప్రాంతీయ శాంతి, ప్రపంచ స్థిరత్వం ప్రభావితమవుతున్నాయని ఆయన తెలిపారు.

వివరాలు 

ఈ నెల చివర్లో ట్రంప్‌ బీజింగ్‌ పర్యటనపై అమెరికాతో చర్చలు

ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేందుకు తక్షణ చర్యలు అవసరమని లిన్‌ జియాన్‌ అమెరికాకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలు ఆగినప్పుడే ప్రాంతీయ స్థిరత్వం సాధ్యమవుతుందని చెప్పారు. ఈ నెల చివర్లో ట్రంప్‌ బీజింగ్‌ పర్యటనపై అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల మెరుగుదలకు ఆ పర్యటన కీలకంగా మారొచ్చని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, ఆదివారం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్‌ హర్మూజ్‌ ప్రాంతంలో చైనాకే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. ఆ జలసంధి భద్రత కోసం ముందుకు రావాలని బీజింగ్‌కు పిలుపునిచ్చారు. చైనా ఇచ్చే స్పందన ఆధారంగా తాను బీజింగ్‌ పర్యటనకు వెళ్లాలా, వాయిదా వేయాలా అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

Advertisement