
Trump health advice: గర్భిణీ స్త్రీలు ఆ మాత్రలకు దూరంగా ఉండండి.. డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఆటిజం (Autism) సమస్య దశాబ్దాలుగా పెరుగుతోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజా డేటా ప్రకారం,అమెరికాలో ప్రతి 36 మంది చిన్నారిలో ఒకరు ఆటిజం సమస్యతో బాధపడుతున్నారని తేలింది. ఈ నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసారు. ఆయన చెప్పినట్లుగా, సాధారణంగా పైన్ కిల్లర్‌గా ఉపయోగించే టైలెనాల్ (Tylenol) మందు కారణంగా ఆటిజం సమస్య రావచ్చు. గర్భవతులైన మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మందును వాడరాదని ఆయన సూచించారు.
వివరాలు
ఆటిజానికి ప్రధాన కారణం జన్యుపరమైన ఫ్యాక్టర్లు
టైలెనాల్‌ను గర్భధారణ సమయంలో తీసుకుంటే, ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ (ASD) ఉన్న పిల్లలకు జన్మనిచ్చే ప్రమాదం ఉంటుందని ట్రంప్ పరిపాలనా వర్గాలు అభిప్రాయపడ్డాయి. దీనికి సంబంధించి 'Tylenol-autism లింక్' అనే విషయాన్ని ప్రకటించారు. అయితే, శాస్త్రవేత్తలు ఈ వాదనను ఖండిస్తూ, ఆటిజానికి టైలెనాల్ కారణం కాదని స్పష్టం చేశారు. వారి అభిప్రాయం ప్రకారం, ఆటిజానికి ప్రధాన కారణం జన్యుపరమైన ఫ్యాక్టర్లు. అయితే, జన్యుపరమైన కారణాల వెంట, పర్యావరణ అంశాలు కూడా ఆటిజం ప్రమాదాన్ని పెంచవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాలుష్యం, దుమ్ము, మైక్రోప్లాస్టిక్స్, పర్యావరణ విషప్రభావకాలు (టాక్సిన్స్) వంటి కారకాలు ఆటిజం ఏర్పడే అవకాశాలను మరింత పెంచుతాయని అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
ప్రతి 150 మందిలో ఒకరికి మాత్రమే ఆటిజం
ఇటీవలి కాలంలో అమెరికాలో ఆటిజం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2000 సంవత్సరంలో, ప్రతి 150 మందిలో ఒకరికి మాత్రమే ఆటిజం సమస్య ఉండేది. కానీ 2020 నాటికి ప్రతి 36 మందిలో ఒకరు ఆటిజం సమస్యతో బాధపడుతున్నారని డేటా చూపిస్తోంది. ఈ నేపథ్యంలో, అమెరికాలో ఆటిజంపై విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. గర్భధారణ సమయంలో,పుట్టిన తర్వాత ఇచ్చే టీకాలు ఆటిజానికి కారణమవుతాయా? అనే ప్రశ్నలను పరిశోధకులు పరిశీలిస్తున్నారు. అయినప్పటికీ, ఇప్పటివరకు ఆటిజానికి ఏది ప్రధాన కారణమో పూర్తి స్థాయిలో నిర్ధారించలేకపోయారు.