Trump: ఇరాన్ విషయంలో నా ముందు మూడు మార్గాలు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా స్పందించారు. అమెరికా విధించిన షరతులను అంగీకరించకపోతే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ తన వైఖరిని మార్చుకోకపోతే భారీ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తాజాగా 'ఫాక్స్ న్యూస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఇరాన్ విషయంలో తాను కీలక నిర్ణయం తీసుకునే దశలో ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ యుద్ధంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రస్తుతం తన ముందు మూడు మార్గాలు ఉన్నాయని చెప్పారు. ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేయడం, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా చర్యలు తీసుకోవడం లేదా ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం వంటి మూడు అవకాశాలను ఆయన ప్రస్తావించారు.
వివరాలు
అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక
సమీప భవిష్యత్తులో చాలా పెద్ద పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
మరోవైపు అమెరికాకు ఇరాన్ కూడా గట్టి హెచ్చరికలు చేసింది.
అమెరికా దాడికి దిగితే గతంలో కంటే మరింత తీవ్రంగా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ ఈ విషయంపై స్పందించారు.
యుద్ధాన్ని అన్ని విధాలుగా ముగించడం, స్తంభింపజేసిన నిధులను విడుదల చేయడం, నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం వంటి పలు షరతులను అమెరికాకు మధ్యవర్తుల ద్వారా పంపినట్లు రెజాయీ తెలిపారు.
తమ డిమాండ్లను అంగీకరించకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టం చేసినట్లు ఆయన వెల్లడించారు.