Trump: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. హార్ముజ్‌పై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్న అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మార్గాన్ని తెరవకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. హార్ముజ్ అంశంపై ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించగా, అలాంటి చర్చలు ఏవీ జరగడం లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. దీంతో ఇరు దేశాల ప్రకటనలు పరస్పర విరుద్ధంగా మారాయి. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, హార్ముజ్ జలసంధి అంశంలో త్వరలోనే స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశముందని తెలిపారు. జలసంధిని వెంటనే తెరవాల్సిందేనని, ఒకటి లేదా రెండు రోజుల్లో పరిస్థితులు తేలిపోతాయని చెప్పారు. ఒకవేళ అలా జరగకపోతే ఇరాన్ తీవ్ర మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
వివరాలు
అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరపడం లేదు: ఇస్మాయిల్ బఘాయి
ఇదే అంశంపై అంతకుముందు వైట్ హౌస్‌లో కూడా ట్రంప్ స్పందించారు.
హార్ముజ్ జలసంధిని తెరవడంపై జరుగుతున్న చర్చలు చివరి దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు.
ఇరాన్‌కు ఇది చివరి అవకాశమని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ వెంటనే ఖండించింది.
ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరపడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి స్పష్టం చేశారు.
విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మినహా చర్చల బృందంలోని సభ్యులంతా ఇరాన్‌లోనే ఉన్నారని ఆయన వెల్లడించారు.
వివరాలు
ఇరాన్ నాయకత్వం ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనం: ట్రంప్
ఇరాన్ ప్రకటనపై ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో స్పందించారు.
ఒకవైపు సమావేశం కావాలని కోరుతూ, మరోవైపు ఎలాంటి చర్చలు జరగడం లేదని చెప్పడం ఇరాన్ నాయకత్వం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
మరోవైపు, ఒమన్‌తో మాత్రం సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఇరాన్ వెల్లడించింది.
హార్ముజ్ జలసంధిలో సముద్ర రవాణా భద్రతకు సంబంధించి తాత్కాలిక ఏర్పాట్లపై చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.
ఈ చర్చల్లో ఒమన్ మినహా మరే ఇతర దేశం పాల్గొనడం లేదని కూడా స్పష్టం చేసింది.