LOADING...
Donald Trump: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తారాస్థాయికి.. యురేనియంపై సైనిక చర్యకు ట్రంప్ సర్కార్ భారీ వ్యూహం!
యురేనియంపై సైనిక చర్యకు ట్రంప్ సర్కార్ భారీ వ్యూహం!

Donald Trump: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తారాస్థాయికి.. యురేనియంపై సైనిక చర్యకు ట్రంప్ సర్కార్ భారీ వ్యూహం!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 30, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌లో ఉన్న అణు కేంద్రాల నుంచి దాదాపు 450 కిలోల శుద్ధి చేసిన యురేనియంను స్వాధీనం చేసుకునేందుకు సైనిక చర్య చేపట్టే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా అమెరికా ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తోంది. ఇస్ఫాహాన్, నతాంజ్ వంటి కీలక అణు కేంద్రాల్లో యురేనియం నిల్వలు ఉన్నాయని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. గతంలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఈ నిల్వలు పూర్తిగా నాశనం కాలేదని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.

వివరాలు 

ఇతర మార్గాలూ సిద్ధంగా ఉన్నాయి: అమెరికా రక్షణ శాఖ

చర్చల ద్వారా ఇరాన్ ఈ యురేనియంను అప్పగించకపోతే, బలవంతంగా స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా ముందడుగు వేయొచ్చని సమాచారం. ఇందుకోసం ఎలైట్ స్పెషల్ ఫోర్సెస్‌తో పాటు ఇతర సైనిక బలగాలను పంపే అవకాశాలు పరిశీలనలో ఉన్నాయి. అయితే, ఈ అంశంపై వైట్ హౌస్ జాగ్రత్తగా స్పందించింది. పెంటగాన్ వివిధ ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయడం సాధారణ ప్రక్రియ మాత్రమేనని, తుది నిర్ణయం తీసుకున్నట్టు కాదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్ స్వచ్ఛందంగా యురేనియంను అప్పగిస్తే మంచిదని, కానీ అవసరమైతే ఇతర మార్గాలూ సిద్ధంగా ఉన్నాయని అమెరికా రక్షణ శాఖ తెలిపింది.

వివరాలు 

వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య పరోక్ష చర్చలు

ఈ ఆపరేషన్ అమలు చేయడం అత్యంత క్లిష్టం, ప్రమాదకరమని సైనిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించి, డ్రోన్లు, క్షిపణులు, భూమి మార్గ దాడుల ముప్పును ఎదుర్కొంటూ మిషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది త్వరగా ముగిసే ఆపరేషన్ కాదని, గణనీయమైన సమయం,వ్యూహం అవసరమని మాజీ సైనిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఒకవైపు సైనిక చర్యలపై చర్చలు జరుగుతుండగా, మరోవైపు పాకిస్థాన్, తుర్కియే, ఈజిప్ట్ వంటి దేశాల మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నాయి. ముందస్తు జాగ్రత్తగా అమెరికా ఇప్పటికే ఆ ప్రాంతంలో సైనిక బలగాలు, ఆయుధాలను మోహరించింది. అవసరమైతే మెరైన్ దళాలు, పారాట్రూపర్లను కూడా రంగంలోకి దింపే అవకాశం ఉందని సమాచారం.

Advertisement