LOADING...
US-China: నేటి నుంచి ట్రంప్‌-జిన్‌పింగ్‌ శిఖరాగ్ర భేటీ.. ప్రపంచ రాజకీయాల్లో ఉత్కంఠ

US-China: నేటి నుంచి ట్రంప్‌-జిన్‌పింగ్‌ శిఖరాగ్ర భేటీ.. ప్రపంచ రాజకీయాల్లో ఉత్కంఠ

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2026
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, హర్మూజ్‌ జలసంధి సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, దెబ్బతింటున్న ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు, సాంకేతిక రంగంలో ముదురుతున్న ఆధిపత్య పోరు వంటి పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కీలక భేటీకి సిద్ధమయ్యారు. గురు, శుక్రవారాల్లో బీజింగ్‌లో జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరుదేశాల మధ్య పలు ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ట్రంప్‌ బుధవారం బీజింగ్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు టెస్లా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో ప్రయాణించారు.

వివరాలు 

హర్మూజ్‌ జలసంధిని తెరిచి ఉంచేలా టెహ్రాన్‌పై ఒత్తిడి

ఈ భేటీలో ప్రధానంగా ఇరాన్‌ అంశం చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్మూజ్‌ జలసంధిని తెరిచి ఉంచేలా టెహ్రాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా చాలా కాలంగా చైనాను కోరుతోంది. ఇరాన్‌తో పాటు గల్ఫ్‌ దేశాలతో చైనాకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో, శాంతి ఒప్పందానికి ఇరాన్‌ను ఒప్పించే దిశగా జిన్‌పింగ్‌ సహకారం కోరేందుకు ట్రంప్‌ ప్రయత్నించే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా-చైనా మధ్య ప్రస్తుతం కృత్రిమ మేధ రంగం కీలక పోటీ వేదికగా మారింది. ఈ రంగంలో అమెరికా కొంత ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. అత్యాధునిక చిప్‌లు, గణన సాంకేతిక పరిజ్ఞానాల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ ఆధిపత్యాన్ని కొనసాగించాలని వాషింగ్టన్‌ ప్రయత్నిస్తోంది.

వివరాలు 

అరుదైన ఖనిజ పదార్థాల సరఫరాలో కూడా చైనా కీలక పాత్ర

దీనిని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ సాంకేతిక అభివృద్ధికి ఈ ఆంక్షలు అడ్డంకిగా మారుతున్నాయని బీజింగ్‌ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంక్షలను ఎత్తివేయాలని చైనా డిమాండ్‌ చేసే అవకాశముంది. అత్యాధునిక సాంకేతిక పరికరాల తయారీలో ఉపయోగించే అరుదైన ఖనిజ పదార్థాల సరఫరాలో కూడా చైనా కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా, దాని మిత్రదేశాలు ఈ పదార్థాల కోసం ఎక్కువగా బీజింగ్‌పైనే ఆధారపడుతున్నాయి. సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని ట్రంప్‌ జిన్‌పింగ్‌ను కోరే అవకాశాలున్నాయి. గత ఏడాది అమెరికా-చైనా మధ్య సుంకాల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ట్రంప్‌ విధించిన అదనపు సుంకాలకు ప్రతిగా చైనా కూడా ప్రతిసుంకాలు విధించింది.

Advertisement

వివరాలు 

తైవాన్‌ అంశం కూడా ఈ భేటీలో కీలకం

అనంతరం అక్టోబరులో ఇరుదేశాల మధ్య సయోధ్య కుదిరింది. ఇప్పుడు అమెరికా తయారీ బోయింగ్‌ విమానాలు, సోయాబీన్‌తో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలును పెంచేలా చైనాను ఒప్పించేందుకు అమెరికా ప్రయత్నించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. తైవాన్‌ అంశం కూడా ఈ భేటీలో కీలకంగా మారనుంది. తైవాన్‌ను తమ భూభాగంలో కలుపుకోవాలన్న లక్ష్యంతో చైనా ముందుకెళ్తోంది. అయితే దీనికి అమెరికా ప్రధాన అడ్డంకిగా నిలుస్తోంది. 'తైవాన్‌ సంబంధాల చట్టం-1979' ప్రకారం తైవాన్‌కు రక్షణ సహాయం అందిస్తామని అమెరికా చెబుతోంది. ఒకవైపు 'ఒకే చైనా' విధానాన్ని సమర్థిస్తూనే, మరోవైపు తైవాన్‌కు మద్దతు ఇవ్వడంపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

Advertisement

వివరాలు 

కొన్ని అంశాలపై ట్రంప్‌ ప్రశ్నలు లేవనెత్తకూడదని చైనా ముందుగానే స్పష్టం

బీజింగ్‌లో జరిగే ఈ శిఖరాగ్ర సమావేశానికి ప్రపంచ వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపించారు. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌, ఆపిల్‌ సంస్థ అధిపతి టిమ్‌ కుక్‌, బోయింగ్‌ ప్రధాన కార్యనిర్వాహకుడు కెల్లీ ఆర్ట్‌బర్గ్‌, ఎన్విడియా అధినేత జెన్సెన్‌ హువాంగ్‌ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశముంది. ఇదిలా ఉండగా, కొన్ని అంశాలపై ట్రంప్‌ ప్రశ్నలు లేవనెత్తకూడదని చైనా ముందుగానే స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా తైవాన్‌, ప్రజాస్వామ్య, మానవ హక్కుల అంశాలు, ముఖ్యంగా వీగర్‌ ముస్లింల వ్యవహారం, చైనా ఏకపక్ష రాజకీయ వ్యవస్థ, అలాగే తమ అభివృద్ధి హక్కులపై చర్చించవద్దని బీజింగ్‌ షరతులు విధించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Advertisement