LOADING...
Donald Trump: వాణిజ్య ఒప్పందాలపై ఆటలాడితే భారీ టారిఫ్‌లు: ట్రంప్ హెచ్చరిక
వాణిజ్య ఒప్పందాలపై ఆటలాడితే భారీ టారిఫ్‌లు: ట్రంప్ హెచ్చరిక

Donald Trump: వాణిజ్య ఒప్పందాలపై ఆటలాడితే భారీ టారిఫ్‌లు: ట్రంప్ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2026
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల విషయంలో 'ఆటలాడాలని' చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఇప్పటికే అంగీకరించిన స్థాయిని మించిపోయే విధంగా భారీ టారిఫ్‌లు, అదనపు లైసెన్స్ ఫీజులు విధించాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. టారిఫ్‌ల విధానంపై అధ్యక్షుడికి ఉన్న ప్రత్యేక అధికారాలను అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల పరిమితం చేసిన కొద్ది రోజులకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే International Emergency Economic Powers Act (IEEPA) కింద విస్తృతంగా సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పు వెలువరించింది.

వివరాలు 

వెంటనే మరో చట్టం కింద 15శాతం తాత్కాలిక దిగుమతి సుంకం విధింపు

పన్నులు విధించే అధికారం రాజ్యాంగ ప్రకారం కేవలం కాంగ్రెస్‌కే పరిమితమని స్పష్టంగా పేర్కొంది. ఈ నిర్ణయంతో ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. 1974 ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 122ను ఆధారంగా తీసుకుని కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై 15 శాతం తాత్కాలిక సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం 150 రోజుల పాటు అమల్లో ఉంటుందని తెలిపారు. కొత్త టారిఫ్ ఫిబ్రవరి 24 నుంచి అమలులోకి రానుందని వెల్లడించారు.

వివరాలు 

ట్రంప్ నిర్ణయంతో యూఎస్-ఈయూ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును 'హాస్యాస్పదం'గా అభివర్ణించిన ట్రంప్, "ఏ దేశమైనా దీనిని అవకాశంగా తీసుకుని అమెరికాతో ఆటలాడాలని చూస్తే, ముఖ్యంగా ఏళ్ల తరబడి అమెరికాను దోపిడీ చేసిన దేశాలు వెనక్కి తగ్గేందుకు ప్రయత్నిస్తే, వారు ఊహించని స్థాయిలో మరింత ఎక్కువ టారిఫ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి" అని తన పోస్టులో హెచ్చరించారు. ఈ పరిణామాల మధ్య అమెరికాతో కుదరాల్సిన వాణిజ్య ఒప్పందంపై జరగాల్సిన ఓటింగ్‌ను యూరోపియన్ పార్లమెంట్ వాయిదా వేసింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో మరోసారి అనిశ్చితి వాతావరణం నెలకొన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement