LOADING...
Trump's 'Naruto': 'నరుటో'గా ట్రంప్‌.. జపాన్‌లో ఆగ్రహం..ఆన్‌లైన్ పిటిషన్‌కు 20వేల మంది మద్దతు

Trump's 'Naruto': 'నరుటో'గా ట్రంప్‌.. జపాన్‌లో ఆగ్రహం..ఆన్‌లైన్ పిటిషన్‌కు 20వేల మంది మద్దతు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైట్‌హౌస్ సోషల్ మీడియా ఖాతాల్లో జపాన్‌కు చెందిన ప్రముఖ మాంగా, అనిమే పాత్రలను ఉపయోగించడంపై జపాన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ట్రంప్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో జూన్ 7న (శనివారం) విడుదలైన ఓ వీడియో ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇందులో ట్రంప్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న 'నరుటో' సిరీస్‌లోని ప్రముఖ నింజా పాత్ర నరుటో ఉజుమాకిగా చూపించారు. ఈ వీడియోపై నరుటో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వివాదం ట్రంప్,వైట్‌హౌస్‌కు కొత్తేమీ కాదు. ఈ ఏడాది మార్చిలోనూ వైట్‌హౌస్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

వివరాలు 

జూన్ 10 నుంచి మళ్లీ సంతకాల సేకరణ

అమెరికా ఇరాన్‌పై జరిపిన సైనిక దాడులకు సంబంధించిన దృశ్యాలతో పాటు పలు ప్రముఖ హాలీవుడ్ చిత్రాలు, టీవీ షోలు, అలాగే 'యు-గి-ఓ!' మాంగా, అనిమే సిరీస్‌కు చెందిన సన్నివేశాలను కలిపి ప్రచురించింది. అప్పట్లో కూడా దీనిపై అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మార్చిలో ప్రారంభించిన ఆన్‌లైన్ పిటిషన్‌ను నిర్వాహకులు తాజాగా మళ్లీ తెరిచారు. నరుటో వీడియో విడుదలైన తర్వాత దీనిని అత్యవసర కార్యక్రమంగా ప్రకటించి, జూన్ 10 నుంచి మళ్లీ సంతకాల సేకరణ చేపట్టారు. ఇప్పటికే దాదాపు 20 వేల మంది ఈ పిటిషన్‌కు మద్దతు తెలిపినట్లు సమాచారం. ఈ పిటిషన్ ప్రధాన ఉద్దేశం మాంగా,అనిమే సిరీస్‌ల హక్కులు కలిగిన సంస్థలు,సృష్టికర్తలకు అభిమానుల ఆందోళనలను నేరుగా తెలియజేయడమేనని నిర్వాహకులు పేర్కొన్నారు.

వివరాలు 

అనిమే, మాంగా సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అభిమానులు

ఈ కళాఖండాలు ఎన్నో ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ధైర్యం, స్నేహం, పట్టుదల వంటి విలువలను అందిస్తూ స్ఫూర్తినిస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఇలాంటి పాత్రలను రాజకీయ లేదా సైనిక ప్రచారాలకు సంబంధించిన సందర్భాల్లో వినియోగించడం వల్ల అసలు సృష్టికర్తల ఉద్దేశాలకు భిన్నమైన సందేశం వెళ్లే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా మాంగా, అనిమే పాత్రలను రాజకీయ, సైనిక అంశాలతో ముడిపెట్టడాన్ని చాలా మంది అభిమానులు వ్యతిరేకిస్తున్నారని పిటిషన్‌లో స్పష్టం చేశారు. జపాన్‌కు చెందిన ఈ ప్రసిద్ధ అనిమే, మాంగా సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అభిమానులు ఉండటంతో, ట్రంప్ 'నరుటో' వీడియో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement