LOADING...
USA-Iran: ట్రంప్‌ తీరు వల్ల అమెరికాకు దౌత్య సమస్యలు..!
ట్రంప్‌ తీరు వల్ల అమెరికాకు దౌత్య సమస్యలు..!

USA-Iran: ట్రంప్‌ తీరు వల్ల అమెరికాకు దౌత్య సమస్యలు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2026
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య అమల్లో ఉన్న కాల్పుల విరమణ గడువు సమీపిస్తోంది. దానికి ఇంకా గంటల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో రెండో విడత చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే చర్చల ముందు నుంచే ప్రకటనలు చేయాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఇరాన్‌ను ఆగ్రహానికి గురిచేస్తోంది. దీంతో చర్చలు జరుగుతాయా లేదా అన్న సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని ఇరాన్ దృఢంగా నిలుస్తోంది. పాకిస్థాన్ వేదికగా జరిగిన తొలి విడత చర్చలకు ఇరు దేశాల ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. అయినప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఫలితం రాకపోవడంతో ఇప్పటికే ఇంధన సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న ప్రపంచం మరింత ఆందోళనకు గురైంది.

వివరాలు 

ఇరాన్‌ను ఆగ్రహానికి గురిచేసిన ట్రంప్ వ్యాఖ్యలు

కాల్పుల విరమణ ముగిసేలోపు రెండో దఫా చర్చలు జరుగుతాయని సమాచారం రావడంతో కొంత ఊరట కలిగింది. కానీ ఆ ఆశలు ఎక్కువసేపు నిలవలేదు. తన సీనియర్ సలహాదారుల సూచనలను పట్టించుకోకుండా ట్రంప్ చేసిన బహిరంగ వ్యాఖ్యలు దౌత్య ప్రయత్నాలకు దెబ్బతీశాయి. ఇరాన్‌లో పర్యటించిన పాకిస్థాన్ మధ్యవర్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆయన ముందుగానే ప్రకటనలు చేయడం ప్రారంభించినట్లు అంతర్జాతీయ మాధ్యమాలు వెల్లడించాయి. ఇరాన్‌ను ఆగ్రహానికి గురిచేసిన ట్రంప్ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ,పాత్రికేయులతో మాట్లాడిన ఆయన తమ షరతులకు ఇరాన్ అంగీకరించిందని ప్రకటించారు. ముఖ్యంగా శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించేందుకు సిద్ధమైందని, యుద్ధం ముగిసిందని కూడా పేర్కొన్నారు.

వివరాలు 

ఇరాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలు

అయితే ఈ వ్యాఖ్యలను ఇరాన్ పూర్తిగా ఖండించింది. అలాంటి ఒప్పందానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. దీంతో కొనసాగుతున్న చర్చల ప్రక్రియపై ప్రభావం పడింది. ట్రంప్ అతివేగ నిర్ణయాలు గత వారం రోజులుగా నెలకొన్న ఆశాజనక వాతావరణాన్ని దెబ్బతీశాయి. ఇదిలా ఉండగా, ఇరాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న సమాచారం అమెరికాను కలవరపెడుతోంది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ వర్గాలకు, అలాగే విప్లవ గార్డుల దళం మధ్య విభేదాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కఠిన వైఖరి కలిగిన వర్గాల ప్రభావం పెరుగుతోందన్న వార్తలు కూడా వెలువడ్డాయి. ఒకవేళ ఒప్పందం కుదిరినా, దానిపై ఎవరి సంతకం చెల్లుబాటు అవుతుందన్న ప్రశ్న అమెరికాను వేధిస్తోంది.

Advertisement

వివరాలు 

మరో ఉద్రిక్త పరిణామం

ఇక ఇరుదేశాల మధ్య ప్రధాన వివాదాంశంగా నిలిచింది ఇరాన్ అణు కార్యక్రమం. యురేనియం శుద్ధి ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని అమెరికా పట్టుబడుతుండగా, దానిని దశలవారీగా నియంత్రించాలనే అభిప్రాయం ఇరాన్ వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం తాత్కాలికంగా శుద్ధి నిలిపివేసి, తరువాత కఠిన పర్యవేక్షణలో పరిమితంగా కొనసాగించాలనే ప్రతిపాదనపై చర్చలు సాగుతున్నాయి. ఇదే అంశం ప్రధాన అడ్డంకిగా మారింది. దీనికి ప్రతిగా ప్రపంచవ్యాప్తంగా నిలిపివేసిన ఆస్తుల్లో కొంత మొత్తాన్ని విడుదల చేయాలని అమెరికా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు కఠిన నిబంధనలు అమలు చేసే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో మరో ఉద్రిక్త పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, హర్మూజ్ సముద్ర మార్గంలో అమెరికా దిగ్బంధం కొనసాగుతోంది.

Advertisement

వివరాలు 

అమెరికా దౌత్య ప్రయత్నాలకే భంగం కలిగించిందన్న ఇరాన్ 

ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను అడ్డుకోవడం ఉద్రిక్తతను పెంచింది. టెహ్రాన్‌కు చెందిన ఓ నౌకపై అమెరికా బలగాలు దాడి చేయడం పరిస్థితిని మరింత విషమం చేసింది. ఈ చర్యలను కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనగా పేర్కొంటూ ఘాలిబఫ్ తీవ్రంగా స్పందించారు. నౌకాయానంపై ఆంక్షలు విధించడం ద్వారా అమెరికా దౌత్య ప్రయత్నాలకే భంగం కలిగించిందని విమర్శించారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌తో చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధులు హాజరవుతారా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.

Advertisement