Trump: అమెరికా ఎన్నికల్లో అక్రమ ఓటింగ్‌పై ట్రంప్ వాదనకు అధికారిక రికార్డుల షాక్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా ఒకే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అమెరికా పౌరులు కాని వ్యక్తులు పెద్ద సంఖ్యలో అక్రమంగా ఓటు వేస్తున్నారని, అదే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతోందని ఆయన పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ వాదన ఆధారంగానే ఓటరు నమోదులో పౌరసత్వ ధ్రువీకరణను తప్పనిసరి చేయాలని, ఎన్నికల నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు మాత్రం ఈ ఆరోపణలకు బలమైన ఆధారాలు చూపించడం లేదు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలంటే పౌరసత్వ ధ్రువీకరణ ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేయాల్సిందేనని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. అందుకే SAVE America Act వంటి చట్టాలకు ఆయన మద్దతు ప్రకటించారు.
వివరాలు
ఎన్నికల భద్రత కోసం ఇటువంటి చట్టాలు
ఎన్నికల భద్రత కోసం ఇటువంటి చట్టాలు అవసరమని రిపబ్లికన్ పార్టీ కూడా వాదిస్తోంది.
మరోవైపు, డెమొక్రటిక్ పార్టీ మాత్రం ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కఠిన నిబంధనలు చట్టబద్ధమైన ఓటర్లకే ఇబ్బందులు కలిగించే ప్రమాదం ఉందని చెబుతోంది.
ఈ అంశం భారతీయులకు కూడా కొత్తది కాదు. ఇటీవల భారత్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన Special Intensive Revision (SIR) ప్రక్రియపై తీవ్ర రాజకీయ చర్చ జరిగింది.
ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించి అర్హుల పేర్లను కొనసాగించడం, అనర్హుల పేర్లను తొలగించడమే లక్ష్యమని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.
అయితే, ఈ ప్రక్రియలో నిజమైన ఓటర్ల పేర్లు కూడా తొలగించే అవకాశం ఉందంటూ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
వివరాలు
అమెరికా పౌరులు కాని వ్యక్తులు ఓటు వేయడం చట్టవిరుద్ధం
దీంతో ఓటరు నమోదు, ధ్రువీకరణ, ఎన్నికల జాబితాల విశ్వసనీయతపై దేశవ్యాప్తంగా చర్చ సాగింది.
ప్రస్తుతం అమెరికాలో కూడా ఇదే తరహాలో SAVE America Act చుట్టూ చర్చ కొనసాగుతున్నా,అక్కడ ప్రధానంగా విదేశీయుల అక్రమ ఓటింగ్ నిజంగా విస్తృతంగా జరుగుతోందా లేదా అనే అంశమే వివాదానికి కేంద్రబిందువైంది.
అమెరికాలో 1996 నుంచే ఫెడరల్ ఎన్నికల్లో అమెరికా పౌరులు కాని వ్యక్తులు ఓటు వేయడం చట్టవిరుద్ధం.
ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదైన ఫెడరల్ కోర్టు రికార్డులను ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ విశ్లేషించింది.
దేశవ్యాప్తంగా కేవలం 129 కేసులు మాత్రమే నమోదైనట్లు తేలగా,వాటిలో 73 మంది మాత్రమే నేరాన్ని అంగీకరించడమో లేదా కోర్టుల ద్వారా దోషులుగా తేలడమో జరిగింది.
వివరాలు
మరో ఆసక్తికర విషయం
కోట్లాది ఓట్లు నమోదయ్యే అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య అత్యంత స్వల్పమని ఆ విశ్లేషణ పేర్కొంది.
రికార్డులను మరింత లోతుగా పరిశీలిస్తే మరో ఆసక్తికర విషయం బయటపడింది.
నమోదైన కేసుల్లో ఎక్కువ భాగం ప్రణాళికాబద్ధంగా ఎన్నికలను ప్రభావితం చేసే కుట్రలకు సంబంధించినవి కావు.
గ్రీన్‌కార్డు కలిగిన కొందరు శాశ్వత నివాసితులు తాము కూడా ఓటు వేయడానికి అర్హులమని పొరపాటుగా భావించడం, మరికొన్ని సందర్భాల్లో పరిపాలనా లేదా సాంకేతిక లోపాల కారణంగా వారి పేర్లు ఓటరు జాబితాలో చేరడం వంటి కారణాలే ఎక్కువగా కనిపించాయి.
విదేశీయులు దేశవ్యాప్తంగా సమన్వయంతో ఎన్నికలను ప్రభావితం చేశారనే నిర్ధారిత ఆధారాలు మాత్రం బయటపడలేదు. అయినప్పటికీ ట్రంప్ తన ఆరోపణలపై వెనక్కి తగ్గలేదు.
వివరాలు
ట్రంప్ వాదనను ప్రశ్నిస్తున్న ఎన్నికల నిపుణులు,పౌరహక్కుల సంస్థలు
మరోవైపు ఎన్నికల నిపుణులు,పౌరహక్కుల సంస్థలు ట్రంప్ వాదనను ప్రశ్నిస్తున్నాయి.
విదేశీయుల అక్రమ ఓటింగ్ విస్తృతంగా జరుగుతోందని నిరూపించే బలమైన ఆధారాలు లేనప్పుడు కఠిన నిబంధనలు అమలు చేయడం వల్ల చట్టబద్ధమైన అమెరికా పౌరులే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.
ముఖ్యంగా విదేశాల్లో జన్మించి అనంతరం అమెరికా పౌరసత్వం పొందిన సహజీకృత పౌరులు అవసరమైన పత్రాలను వెంటనే సమర్పించలేక ఓటుహక్కును కోల్పోయే పరిస్థితి తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవల న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా కొందరు అమెరికా పౌరులు కాని వ్యక్తుల పేర్లు పొరపాటున ఓటరుజాబితాలో నమోదైన ఘటన కూడా చర్చనీయాంశమైంది.
అయితే ఆ సందర్భంలోనూ వాస్తవంగా ఓటు వేసిన వారి సంఖ్య చాలా పరిమితంగానే ఉందని అధికారులు స్పష్టం చేశారు.
వివరాలు
ఎన్నికల భద్రత, ఓటరు ధ్రువీకరణపై రాజకీయంగా తీవ్ర చర్చ
ఈ ఒక్క ఘటనను దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ ఎన్నికల మోసానికి నిదర్శనంగా పరిగణించలేమని వారు వివరించారు.
మొత్తంగా చూస్తే, అమెరికా ఎన్నికల్లో విదేశీయులు భారీ స్థాయిలో అక్రమంగా ఓటు వేస్తున్నారన్న ట్రంప్ ఆరోపణలకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు బలమైన మద్దతు ఇవ్వడం లేదని రాయిటర్స్ విశ్లేషణ వెల్లడించింది.
ఎన్నికల భద్రత, ఓటరు ధ్రువీకరణపై రాజకీయంగా తీవ్ర చర్చ కొనసాగుతున్నప్పటికీ, నమోదైన కేసుల సంఖ్య మాత్రం సమస్య పరిమిత స్థాయిలోనే ఉందని సూచిస్తోంది.
దీంతో ట్రంప్ చేస్తున్న ఆరోపణలు ఒకవైపు ఉంటే, అధికారిక గణాంకాలు మాత్రం భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయని తాజా విశ్లేషణ స్పష్టం చేసింది.