LOADING...
Tulsi Gabbard:కొవిడ్ మూలాలపై కొత్త పత్రాలు.. ఫౌచీపై తులసి గబ్బార్డ్ తీవ్ర ఆరోపణలు
కొవిడ్ మూలాలపై కొత్త పత్రాలు.. ఫౌచీపై తులసి గబ్బార్డ్ తీవ్ర ఆరోపణలు

Tulsi Gabbard:కొవిడ్ మూలాలపై కొత్త పత్రాలు.. ఫౌచీపై తులసి గబ్బార్డ్ తీవ్ర ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2026
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బార్డ్ సంచలన ఆరోపణలు చేశారు. త్వరలో తన పదవికి వీడ్కోలు పలకనున్న నేపథ్యంలో ఆమె పలు కీలక పత్రాలను డీక్లాసిఫై చేస్తూ ప్రపంచం ముందుకు తీసుకువచ్చారు. ఈ పత్రాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారుగా పనిచేసిన డాక్టర్ ఆంథోనీ ఫౌచీపై పలు ఆరోపణలు ఉన్నట్లు వెల్లడించారు. తులసి గబ్బార్డ్ వివరాల ప్రకారం,ఫౌచీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (NIAID) డైరెక్టర్‌గా ఉన్న సమయంలో చైనాలోని వుహాన్ ప్రయోగశాలలో కొవిడ్‌కు సంబంధించిన పరిశోధనలకు నిధులు అందించారని పేర్కొన్నారు.

వివరాలు 

మిలియన్ల డాలర్ల నిధులను వుహాన్ ల్యాబ్‌కు మళ్లించారని ఆరోపించిన తులసి 

అంతేకాకుండా,కొవిడ్ వైరస్ మూలాలపై అమెరికా నిఘా సంస్థల అంచనాలను ప్రభావితం చేయడంతో పాటు ఈ అంశంలో కాంగ్రెస్‌ను కూడా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందన్న వాదనలు కొనసాగుతున్న వేళ ఈ పత్రాల విడుదల ప్రాధాన్యత సంతరించుకుంది. ఫౌచీ పాత్రకు సంబంధించిన సమాచారం,మహమ్మారి సమయంలో చైనా నిఘా అధికారులతో జరిగిన సంభాషణల వివరాలు తమ వద్ద ఉన్నాయని తులసి గబ్బార్డ్ తెలిపారు. అమెరికా పన్ను చెల్లింపుదారుల నుంచి సేకరించిన మిలియన్ల డాలర్ల నిధులను వుహాన్ ల్యాబ్‌కు మళ్లించారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, వైరస్ అదే ప్రయోగశాల నుంచి వ్యాపించిందన్న అనుమానాలు బయటకు రాకుండా చూసేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థలోని రాజకీయ ప్రేరేపిత వర్గాల సహకారాన్ని ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు.

వివరాలు 

30కిపైగా దేశాల్లో ఉన్న 120కిపైగా జీవ ప్రయోగశాలలకు అమెరికా ప్రభుత్వం ఆర్థిక సహాయం

ఈ విషయాన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడికి సైతం పూర్తిస్థాయిలో తెలియనివ్వలేదని ఆమె వ్యాఖ్యానించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా అమెరికాలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని, కోట్లాది కుటుంబాలు తమ ఆత్మీయులను దూరం చేసుకున్నాయని తులసి గబ్బార్డ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వాస్తవాలను కొందరు ఏళ్ల తరబడి దాచిపెట్టారని, ప్రజలకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ పత్రాలను విడుదల చేసినట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో చేపట్టిన సమీక్షలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయని ఆమె వెల్లడించారు. తమ దర్యాప్తులో చైనాతో పాటు 30కిపైగా దేశాల్లో ఉన్న 120కిపైగా జీవ ప్రయోగశాలలకు అమెరికా ప్రభుత్వం చాలా కాలంగా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

Advertisement

వివరాలు 

జూన్ 30 నుంచి తాను అధికారిక బాధ్యతల నుంచి వైదొలగనున్న తులసి 

ఇదిలా ఉండగా, అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ గత నెలలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తన భర్త అబ్రహాం ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. జూన్ 30 నుంచి తాను అధికారిక బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు.

Advertisement