Iran: శాంతి ఒప్పందంపై ట్విస్ట్.. 24 గంటల్లో సంతకాలు లేవన్న ఇరాన్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం త్వరలో కుదరనుందనే వార్తల మధ్య ఇరాన్ కీలక ప్రకటన చేసింది. రానున్న 24 గంటల్లో శాంతి ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని పాకిస్థాన్ ప్రకటించినప్పటికీ, ఆదివారం అలాంటి ఎలాంటి సంతకాల కార్యక్రమం లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
వివరాలు
పాకిస్థాన్ ప్రకటనతో చర్చనీయాంశం
పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగుతున్న ఘర్షణకు ముగింపు పలికే దిశగా అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి ఒప్పంద ముసాయిదాపై ఏకాభిప్రాయానికి వచ్చాయని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. తుది ఒప్పంద పాఠం కూడా ఖరారైందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, రాబోయే 24 గంటల్లో ఎలక్ట్రానిక్ విధానంలో ఒప్పందంపై సంతకాలు చేయడానికి పాకిస్థాన్ సన్నాహాలు చేస్తోందని కూడా షెహబాజ్ షరీఫ్ వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ ప్రకటనకు భిన్నంగా ఇరాన్ స్పందించడం గమనార్హం.
వివరాలు
"యుద్ధాన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైంది" : ట్రంప్
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు స్పష్టం చేసినట్లు ఆక్సియోస్ వార్తా సంస్థ వెల్లడించింది. గురువారం నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్, అమెరికా-ఇరాన్ మధ్య కుదరనున్న ఒప్పందాన్ని "గొప్ప ఒప్పందం"గా అభివర్ణించినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరిని ఉటంకిస్తూ ఆక్సియోస్ పేర్కొంది. "ఇదే ఆ ఒప్పందం.. ఇది గొప్ప ఒప్పందం.. ఈ యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది" అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
వివరాలు
అణు కార్యక్రమంపై నెతన్యాహు ఆందోళన
ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలు శాంతి ఒప్పందంలో తప్పనిసరిగా ఉండాలని నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఆయన అమెరికా అధ్యక్షుడితో పెద్దగా వాదనకు దిగలేదని ఆ అధికారి తెలిపారు. ఇక అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదరడం దాదాపు ఖాయమని, దానిని తాను అడ్డుకోలేనని నెతన్యాహు గ్రహించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అమెరికా ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల నెతన్యాహు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు మరో ఉన్నతస్థాయి వర్గం ఆక్సియోస్‌కు వెల్లడించింది.
వివరాలు
భారత నౌకపై దాడి వార్తలు అవాస్తవం
భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న 'లియాకీ ఫ్రీడమ్' నౌకపై సైనిక దాడి జరిగిందన్న వార్తలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. నౌక మాస్టర్‌తో మాట్లాడిన అనంతరం అందులోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. నౌకపై ఎలాంటి దాడి జరగలేదని, ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
వివరాలు
నౌకలపై దాడులకు మేము కారణం కాదు : ఇరాన్
హోర్ముజ్ జలసంధిలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై జరిగిన డ్రోన్ దాడుల వెనుక ఇరాన్ ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలను భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ వాటిని తిరస్కరించింది. మరోవైపు, మూడు భారతీయ నౌకలపై అమెరికానే దాడులు జరిపిందని, ఆ ఘటనల్లో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఆరోపించింది. ఈ పరిణామాల మధ్య అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి కొనసాగుతుండగా, పశ్చిమాసియా పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది