
USA: ఫేక్ వీసాల పేరిట మోసం.. ఇద్దరు పాకిస్థానీయులు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, తప్పుడు ఉద్యోగ అవకాశాలు సృష్టించి, వాటి ఆధారంగా విదేశీయులకు వీసాలు విక్రయించిన ఘటనలో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులు ఎఫ్‌బీఐ అధికారులకు చిక్కారు.
టెక్సాస్ ప్రాంతంలో ఈ మోసాలు సాగినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ వెల్లడించారు.
పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్ హది ముర్షిద్ (39), మహమ్మద్ సల్మాన్ (35) అనే వ్యక్తులు అమెరికాలో నకిలీ ఉద్యోగ పత్రాలు సృష్టించి, వాటిని వీసా పొందాలనుకునే విదేశీయులకు విక్రయిస్తూ భారీ మొత్తంలో డబ్బు సంపాదించేవారు.
వీరు EB-2, EB-3, H-1B వీసా ప్రోగ్రాముల్ని దుర్వినియోగం చేస్తూ, నకిలీ ఉద్యోగ ప్రకటనలు పత్రికల్లో ప్రచురించారు.
అంతేకాకుండా ఉద్యోగాల కోసం అమెరికన్లకే అవకాశాలు ఇస్తున్నట్లు లేబర్ డిపార్ట్‌మెంట్‌ను మోసం చేశారు.
Details
చట్టవిరుద్ధంగా పౌరసత్వం పొందినట్లు ఆరోపణలు
వీసా అప్రూవల్ తర్వాత, గ్రీన్‌కార్డుల కోసం ఇమ్మిగ్రేషన్ విభాగాన్ని అభ్యర్థించే తతంగం సాగేవారు. ఎఫ్‌బీఐ అధికారుల విచారణలో ముర్షిద్ అమెరికా పౌరసత్వాన్ని చట్టవిరుద్ధంగా పొందే యత్నం చేశాడని తేలింది.
వారు చాలా కాలంగా ఈ విధమైన కార్యకలాపాలు సాగిస్తున్నారని డల్లాస్ స్పెషల్ ఏజెంట్ పేర్కొన్నారు. ఈ ఘటనతో మరోసారి అమెరికాలో ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం స్పష్టమైందని అధికారులు తెలిపారు.
నిందితులను కోర్టులో హాజరుపరచగా, విచారణ అనంతరం కస్టడీకి అప్పగించాల్సిందిగా అధికారులు అభ్యర్థించారు.
ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 30న జరగనుంది. మోసంలో వారిపై అభియోగాలు రుజువైతే, దాదాపు 20 ఏళ్ల జైలు శిక్షపడే అవకాశముందని న్యాయవర్గాలు వెల్లడించాయి.