Cyclone Chido: మయోట్‌లో ఛీడో తుపాను బీభత్సం.. మరణాలు వెయ్యికి పెరిగే అవకాశం
హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఛీడో తుపాను ఫ్రెంచ్ ద్వీపకల్పం మయోట్‌ను తీవ్రంగా తాకింది. గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీయడంతో అనేక ప్రాంతాల్లో నివాసాలు ధ్వంసమయ్యాయి. గత 90 సంవత్సరాల్లో మయోట్ ఇలాంటి తుపానును చూడలేదని స్థానికులు వెల్లడించారు. ఈ తుపాను కారణంగా మయోట్ మాత్రమే కాకుండా పక్కనే ఉన్న కొమోరోస్, మడగాస్కర్ ద్వీపాలపైనా భారీ ప్రభావం చూపింది. ఇప్పటికే మయోట్‌లో పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. వందలాది మంది గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
పూర్తిగా ధ్వంసమైన గ్రామాలు
మయోట్‌తో పాటు కొమోరోస్, మడగాస్కర్ ద్వీపాలపై ఛీడో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. మృతుల సంఖ్య వెయ్యి వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. తుపాను ప్రభావం భారీగా ఉండటంతో పునరావాస చర్యలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మయోట్‌తో పాటు ఇతర ప్రభావిత ప్రాంతాలకు అంతర్జాతీయ సహాయ సంస్థలు ముందుకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.