
Myanmar Floods: యాగీ తుపాను భీభత్సం.. మయన్మార్‌లో 226 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
భారీ వర్షాల కారణంగా మయన్మార్ అతలాకుతలమవుతోంది. యాగీ తుపాను కారణంగా వరదలు, కొండచరియల విరిగిపడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇప్పటికే ఈ ఘటనల్లో 226 మంది ప్రాణాలు కోల్పోగా, 77 మంది గల్లంతయ్యారు. లక్షలాది ప్రజలు తమ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.
దాదాపు 6.30 లక్షల మంది ఈ ప్రకృతి విపత్తు ప్రభావానికి గురయ్యారని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇప్పటికే అంతర్యుద్ధంతో ఇబ్బందులు పడుతున్న మయన్మార్‌లో ఇప్పుడు వరదల కారణంగా వేల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి.
Details
ఆహారం, ఆశ్రయం కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలు
రాజధాని నేపిడావ్ సహా పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు తాగునీరు, ఆహారం, ఆశ్రయం కోసం ఇబ్బందులు పడుతున్నారని ఐరాస తెలిపింది.
రహదారులు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో, మయన్మార్ సైనిక పాలక వర్గం విదేశీ సాయం కోరినట్లు తెలుస్తోంది.
యాగీ తుపాను వియత్నాం, థాయ్‌లాండ్, లావోస్‌లలోనూ విధ్వంసం సృష్టించింది.