Typhoon Yagi: మయన్మార్‌లో బీభత్సం సృష్టిస్తున్న యాగీ తుఫాన్.. 226 మంది మృతి
మయన్మార్‌లో యాగీ తుఫాన్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఇటీవల వియత్నాంలో పెద్దఎత్తున నష్టాన్ని చేకూర్చిన ఈ తుఫాన్ ఇప్పుడు మయన్మార్‌ను ఎదుర్కొంటోంది. భారీ వర్షాల కారణంగా ప్రాంతాలు అగ్నిపర్వతాల్లా మారుతున్నాయి. వరదలు భారీగా వస్తుండటంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో దాదాపు 226 మంది మరణించగా, 77 మంది తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం 6.30 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి విపత్తు సంస్థ తెలిపింది, మరింత మృతుల సంఖ్య పెరగొచ్చని సూచించింది.
వియత్నాంలో 300 మంది మృతి
ఈ తుఫాన్ రాజధాని నేపిడావ్, కయా, కైన్, షాన్ రాష్ట్రాల్లో ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తోంది. సుమారు 5 లక్షల మంది ఆహారం,తాగునీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. మయన్మార్ చరిత్రలో ఇంతటి తీవ్రమైన తుఫాన్ ఇప్పటివరకు రాలేదని,ఈ తుఫాన్ కారణంగా అత్యంత తీవ్రమైన వరదలు ఎదురయ్యాయనీ ఐక్యరాజ్యసమితి తెలిపింది. 2,60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రహదారులు, మౌలిక సదుపాయాలు పూర్తిగా నాశనమయ్యాయి. సహాయక చర్యలకు వర్షాలు ఆటంకం కలిగించడంతో సహాయ కార్యక్రమాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మయన్మార్ సైనిక పాలక వర్గం సహాయం కోసం పలు దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. యాగీ తుఫాన్ చైనా, వియత్నాం,థాయిలాండ్, లావోస్ దేశాలకు కూడా ప్రభావం చూపిస్తోంది. వియత్నాంలో ఇప్పటివరకు దాదాపు 300 మంది మరణించారు.