UAE-Iran: అమెరికా ఆంక్షల వేళ ఇరాన్‌కు భారీ ఊరట .. రెండు టన్నుల బంగారం ఇచ్చిన యూఏఈ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు. చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాలు ప్రతిష్ఠంభనకు చేరుకోవడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాలు కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిసేపటికే మళ్లీ దాడులకు దిగుతున్నాయి. అమెరికా దాడులతో ఇరాన్ తీవ్రంగా స్పందిస్తూ గల్ఫ్ దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో తమ భూభాగం కూడా యుద్ధంలో లక్ష్యంగా మారకూడదని భావిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఇరాన్‌ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇరాన్‌కు భారీగా ఆర్థిక సాయం అందించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇందులో సుమారు రెండు టన్నుల బంగారం కూడా ఉన్నట్లు సమాచారం.
వివరాలు
ఇరాన్ స్తంభించిన నిధుల విడుదల
అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ప్రపంచంలోని పలు దేశాల బ్యాంకుల్లో ఇరాన్‌కు చెందిన ఆస్తులు,నిధులు స్తంభించిపోయాయి.
ఈ నిధులను విడుదల చేసి ఇరాన్‌కు అందించడం ద్వారా టెహ్రాన్‌ను యుద్ధానికి దూరంగా ఉంచేందుకు యూఏఈ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రణాళికలో భాగంగా ఆగస్టు 11, 12 తేదీల్లో అబుధాబి నుంచి టెహ్రాన్‌కు విమానాలు నడిచినట్లు సమాచారం.
ఈ విమానాల ద్వారా స్తంభింపజేసిన ఇరాన్ నిధులను తరలించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి.
ఇదే తరహాలో జూన్ 8న కూడా అబుధాబి నుంచి ఇరాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయానికి ఓ విమానం వెళ్లింది.
ఆ సమయంలో సుమారు 3 బిలియన్ డాలర్లను ఇరాన్‌కు బదిలీ చేసినట్లు వార్తలు వచ్చాయి.
వివరాలు
ఇరాన్‌కు విమానాలు కూడా
యూఏఈ తరలించిన నిధుల్లో సుమారు 283 మిలియన్ డాలర్ల విలువైన రెండు టన్నుల బంగారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌కు ఆర్థిక సాయం అందించడంతో పాటు అక్కడి విమానయాన సంస్థలకు 15 సెకండ్‌హ్యాండ్ విమానాలను విక్రయించేందుకు కూడా యూఏఈ అంగీకరించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
అంతేకాదు.. మరో 14 ప్యాసింజర్ విమానాలను కూడా తిరిగి అప్పగించనున్నట్లు సమాచారం.
ఇందులో రెండు ఎయిర్‌బస్ విమానాలు ఇరాన్‌కు తరలించడానికి ముందు రొమేనియాలోని ఓ విమానాశ్రయంలో ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైనట్లు తెలుస్తోంది.
అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తమకు చెందిన 30 ప్యాసింజర్ విమానాలు ధ్వంసమైనట్లు ఇరాన్ గతంలో ప్రకటించింది.
ఇప్పుడు యూఏఈ నుంచి అందనున్న విమానాలు ఆ లోటును కొంతవరకు భర్తీ చేయనున్నాయి.
వివరాలు
యూఏఈ వ్యూహం ఇదేనా?
పశ్చిమాసియాలో ఘర్షణలు ఎప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో తమ భూభాగంపై ఇరాన్ నుంచి దాడులు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే యూఏఈ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది.
మరోవైపు అమెరికా ఆంక్షలు, యుద్ధ ప్రభావంతో ఇరాన్ ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతింటోంది.
ఇలాంటి సమయంలో స్తంభించిన నిధులను విడుదల చేయడం, బంగారాన్ని బదిలీ చేయడం ద్వారా టెహ్రాన్‌కు తాత్కాలికంగా ఆర్థికంగా కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
మొత్తంగా యూఏఈ చర్యలు ఒకవైపు ఇరాన్‌కు ఆర్థిక బలాన్ని అందిస్తుండగా.. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం తమ దేశంపై పడకుండా చూసుకునే వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నాయి.