Uganda: కాంగోలో ఎబోలా భయం.. సరిహద్దు మూసివేసిన ఉగాండా
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో అరుదైన ఎబోలా వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పొరుగు దేశమైన ఉగాండా అత్యవసర చర్యలకు దిగింది. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కాంగోతో ఉన్న సరిహద్దును వెంటనే మూసివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాంగో నుంచి సరిహద్దు దాటి వచ్చిన వ్యక్తుల ద్వారా స్థానిక ఆరోగ్య సిబ్బందికి వైరస్ సోకినట్లు గుర్తించడంతో పాటు కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యక్షురాలు జెస్కా అలుపో నేతృత్వంలోని ప్రత్యేక కార్యాచరణ బృందం ఈ చర్యను అమలు చేసింది.
వివరాలు
వెయ్యికి చేరువలో అనుమానిత కేసులు
తూర్పు కాంగోలో ఎబోలా అనుమానితుల సంఖ్య వెయ్యికి చేరువలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు సుమారు 220 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాంగో ఆరోగ్య శాఖ ప్రకారం ఇప్పటివరకు 101 కేసులు అధికారికంగా నిర్ధారణ అయ్యాయి. అలాగే వైరస్ బారినపడిన వారితో సన్నిహితంగా మెలిగిన దాదాపు 3 వేల మంది వివరాలను అధికారులు సేకరిస్తూ పర్యవేక్షిస్తున్నారు.
వివరాలు
ఉగాండాలోనూ నమోదైన కేసులు
ఉగాండాలో ఇప్పటివరకు ఏడు ఎబోలా కేసులు నమోదయ్యాయి. మొదటి బాధితుడిగా గుర్తించిన 59 ఏళ్ల వ్యక్తి మే 14న రాజధాని కంపాలాలో మృతి చెందారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కరచాలనాలు చేయకుండా ఉండడం,చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, క్రిమినాశక ద్రావణాలను వినియోగించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిస్తున్నారు.
వివరాలు
భారత్‌లోనూ అప్రమత్త చర్యలు
ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లోనూ ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి. కాంగో నుంచి వచ్చిన ఓ వ్యాపారవేత్తతో పాటు మరో ముగ్గురిని గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచింది. అహ్మదాబాద్‌లోని వేర్వేరు ఆస్పత్రుల్లో వారిని చేర్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. వారి నమూనాలను ఎబోలా నిర్ధారణ పరీక్షల కోసం పంపించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పాన్షేరియా వెల్లడించారు. అలాగే బెంగళూరులో ఉగాండా నుంచి వచ్చిన ఓ మహిళలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో వైద్య బృందాలు పరీక్షలు చేపట్టాయి. అయితే పరీక్ష ఫలితాల్లో వైరస్ లేనట్లు తేలడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.