UK: హర్మూజ్ జలసంధిలో ఇరాన్ మైన్స్‌కు చెక్: అండర్‌వాటర్ డ్రోన్లతో యూకే భారీ ప్లాన్!
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిలో వ్యూహాత్మకంగా శత్రు నౌకలను అడ్డుకునేందుకు ఇరాన్ సముద్ర గర్భంలో 'నేవల్ మైన్స్' (Sea Mines)ను అమర్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా,దాని మిత్రదేశాల నౌకలు ప్రవేశిస్తే పేలిపోయేలా ఈ మైన్స్‌ను Strait of Hormuz ప్రాంతంలో విస్తరించింది. ఈ పరిస్థితుల్లో వాటిని గుర్తించి నిర్వీర్యం చేయడానికి అండర్‌వాటర్ డ్రోన్లను వినియోగించాలనే యోచనలో యూకే ఉన్నట్లు సమాచారం. ఈ డ్రోన్లను తమ రాయల్ నేవీ నౌకల్లో అమర్చేందుకు Royal Navy ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఆధునిక సాంకేతికతతో రూపొందిన ఈ డ్రోన్లు సముద్ర గర్భాన్ని స్కాన్ చేసి మైన్స్‌ను గుర్తించి, వాటిని సురక్షితంగా తొలగించగలవు.
వివరాలు
ఈ మిషన్‌లో భాగంగా యుద్ధ నౌకలు,యుద్ధ విమానాలు
అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్న భద్రతా చర్యల్లో భాగంగా యూకే తన RFA Lyme Bay అనే సపోర్ట్ షిప్‌ను పశ్చిమాసియాకు పంపేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని రాయల్ నేవీ అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా ఈ నౌకలో సైనిక సామగ్రి, వాహనాలు,బలగాలు తరలిస్తారు. అయితే ఇప్పుడు దీనిని మైన్ హంటింగ్ సామర్థ్యాలతో అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ ఆపరేషన్‌లో సంప్రదాయ మైన్ క్లియర్ షిప్‌లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే స్వయంప్రతిపత్తిగల డ్రోన్లను కూడా వినియోగించనున్నారు. ఈ డ్రోన్లు అధునాతన సెన్సర్ల సహాయంతో సముద్ర గర్భాన్ని పరిశీలించి, మైన్స్‌ను గుర్తించి నిర్వీర్యం చేస్తాయి. ఇక ఈ మిషన్‌లో భాగంగా యుద్ధ నౌకలు,యుద్ధ విమానాలను కూడా వినియోగించి ఇంధన నౌకలకు భద్రమైన మార్గాలను ఏర్పాటు చేయనున్నారు.
వివరాలు
అండర్‌వాటర్ డ్రోన్ల వినియోగంపై యూకే దృష్టి
ఇదే సమయంలో అమెరికా ఇప్పటికే పశ్చిమాసియాలో వేలాది మెరైనర్లను మోహరించినట్లు సమాచారం. వీరు భూభాగ ఆపరేషన్ల కోసం సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు Iran వద్ద సుమారు 2,000 నుంచి 6,000 వరకు నేవల్ మైన్స్ ఉన్నాయని అంచనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని చైనా, రష్యా నుంచి కొనుగోలు చేయగా, మరికొన్ని స్వదేశీగా తయారు చేసినవే. గతంలో 1980ల ట్యాంకర్ వార్ సమయంలో ఈ మైన్స్‌ను విస్తృతంగా ఉపయోగించి అనేక నౌకలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే మైన్‌స్వీపర్ నౌకల పనితీరు పరిమితంగా ఉండటంతో, మరింత సమర్థవంతమైన పరిష్కారంగా అండర్‌వాటర్ డ్రోన్ల వినియోగంపై యూకే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.