China-Britain: చైనా-బ్రిటన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం.. జిన్‌పింగ్‌తో స్టార్మర్ భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్,బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సుస్థిర, దీర్ఘకాలిక, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరతలకు తమ రెండు దేశాల మైత్రి కీలకమని అభిప్రాయపడ్డారు మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా బుధవారం బీజింగ్‌లో అడుగు పెట్టిన స్టార్మర్, గురువారం గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో షీ జిన్‌పింగ్‌తో దాదాపు 80 నిమిషాల పాటు సమావేశమయ్యారు. గ్రీన్‌లాండ్ విషయంలో ఐరోపా దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న ఒత్తిడి నేపథ్యంతో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత పొందింది. ఇది ఎనిమిదేళ్ల తర్వాత బ్రిటన్ ప్రధాని చైనాలో చేపట్టిన తొలి పర్యటన.
వివరాలు
బ్రిటన్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయం
జిన్‌పింగ్ మాట్లాడుతూ, బ్రిటన్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రధాన దేశాలు అంతర్జాతీయ చట్టాలను గౌరవించాల్సిందిగా, లేకపోతే ప్రపంచం ఆటవిక రాజ్యంగా మారే ప్రమాదముందని పరోక్షంగా అమెరికాను ఉద్దేశిస్తూ హెచ్చరించారు. మరోవైపు, చైనా ఇతర దేశాలకు హాని కలిగించబోనని స్పష్టంగా చెప్పారు. ఈ సమావేశంలో దాదాపు 10 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి. అంతేకాక, బ్రిటన్ పౌరులు వీసా అవసరం లేకుండా చైనాకు ప్రవేశించగలుగుతారని స్టార్మర్ తెలిపారు.