UK-Deep Fake Pictures-Videos-New Law: డీప్ ఫేక్ చిత్రాలను క్రియేట్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొచ్చిన బ్రిటన్
మహిళలను కించపరుస్తూ వారి గౌరవానికి భంగం కలిగించేలా డీప్ ఫేక్ (Deep Fake) చిత్రాలను గానీ, వీడియోలను గానీ క్రియేట్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తూ బ్రిటన్ (Britan) దేశం చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరి అనుమతిలేకుండా లేదా మహిళలకు సంబంధించి ఎవరైనా డీప్ ఫేక్ చిత్రాలను గానీ, వీడియోలను గాని క్రియేట్ చేసినా, వాటిని షేర్ చేసినా చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని బ్రిటన్ న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డీప్ ఫేక్ చిత్రాలు లేదా వీడియోలుచేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం లేదా వాటిని షేర్ చేయడం వంటివి చేసిన వారికి భారీ జరిమానా తోపాటు జైలు శిక్ష కూడా విధించనున్నట్లు బ్రిటన్ తెలిపింది.
ఏఐ రాకతో పెరిగిన డీప్ ఫేక్ ఘటనలు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో డీప్ ఫేక్ చిత్రాలు, వీడియోలు క్రియేట్ చేసి కొంతమంది దానిని దుర్వినియోగపరుస్తున్న నేపథ్యంలో బ్రిటన్ ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. మహిళలు, బాలికలపై లైంగికహింస లేదా వారి గౌరవానికి భంగం కలిగించేలా ఏఐ టెక్నాలజీతో చిత్రాలుగానీ, వీడియోలు గానీ చేయడాన్ని దేశానికి ఉన్న అతిపెద్ద ముప్పుగా బ్రిటన్ పేర్కొంది. ఇటువంటి డీప్ ఫేక్ చిత్రాలు, వీడియోలను అరికట్టడానికి పోలీసులకు అనుమతినిస్తూ ఈ చట్టం రూపొందింది. డీప్ ఫేక్ చిత్రాల లేదా వీడియోల బాధితులకు బ్రిటన్ తీసుకొచ్చిన కొత్త చట్టం ఊరట కలిగించనుంది. ఏఐ టెక్నాలజీతో డీప్ ఫేక్ చిత్రాలు లేదా వీడియోలు క్రియేట్ చేయడం తీవ్ర నేరమని, అనైతికమని ఈ చట్టం స్పష్టం చేస్తోంది.
తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు: మంత్రి లారా ఫారిస్
ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఏఐ టెక్నాలజీ ద్వారా డీప్ ఫేక్ చిత్రాలు, వీడియోలు క్రియేట్ చేస్తే చట్ట పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బాధితుల, వారి పరిరక్షణ మంత్రి లారా ఫారిస్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఇటువంటి సైబర్ నేరాలను అరికట్టేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు.