Russia: రష్యా ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ దాడి.. మళ్లీ మంటల్లో కిరిషి ప్లాంట్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. కిరిషి ప్రాంతంలోని ఓ చమురు శుద్ధి కర్మాగారాన్ని డ్రోన్ ఢీకొనడంతో అక్కడ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గతంలోనూ ఇదే రిఫైనరీని కీవ్ లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా దెబ్బతీసింది. అనంతరం మాస్కో దానిని పునరుద్ధరించింది. మరికొద్ది రోజుల్లో ఈ కర్మాగారంలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా తాజా డ్రోన్ దాడి జరగడం గమనార్హం. రోజుకు 4లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉంది. ఇందులో డీజిల్, గ్యాసోలిన్, ఫ్యూయల్ ఆయిల్ ఉత్పత్తి చేస్తారు. ఉక్రెయిన్ ప్రయోగించిన దాదాపు 494 డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసినట్లు రష్యా వెల్లడించింది. ఈ నెలలోనే 20కి పైగా రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడులు చేసినట్లు పేర్కొంది.
వివరాలు
38 మంది మృతి
వరుస దాడుల నేపథ్యంలో దేశీయ మార్కెట్‌కు ఇంధన సరఫరాను కొనసాగించేందుకు డీజిల్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు రష్యా ప్రకటించింది.
ఉక్రెయిన్ దాడులకు ప్రతిస్పందనగా ఆ దేశంలోని ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని మాస్కో హెచ్చరించింది.
ఇదిలా ఉండగా, వరుసగా జరుగుతున్న దాడుల కారణంగా రష్యాలో గ్యాసోలిన్ కొరత ఏర్పడినట్లు సమాచారం.
మరోవైపు శనివారం తెల్లవారుజామున కీవ్‌పై రష్యా దాడి చేసింది. ఈ దాడి కారణంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన ఓ గిడ్డంగిలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు 38 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.