Ukraine: వెయ్యికిపైగా డ్రోన్లతో రష్యాపై ఉక్రెయిన్ మెరుపుదాడి.. మాస్కోలో హైఅలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాపై ఉక్రెయిన్ భారీగా డ్రోన్ దాడులకు పాల్పడింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వెయ్యికిపైగా డ్రోన్లతో దాడులు చేసినట్లు సమాచారం. వీటిలో 800కుపైగా డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మాస్కోలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. మాస్కో ఆయిల్ రిఫైనరీ సమీపంలోనూ డ్రోన్ దాడులు జరగడంతో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు సమాచారం. దాడుల ప్రభావంతో మాస్కోలోని ప్రధాన విమానాశ్రయాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో పలు విమాన సర్వీసులు రద్దు కాగా.. మరికొన్ని ఆలస్యంగా నడిచాయి.
వివరాలు
ఐదేళ్లలో అతిపెద్ద దాడుల్లో ఇదొకటి
గత ఐదేళ్లలో ఉక్రెయిన్.. మాస్కోపై చేసిన అతిపెద్ద వైమానిక దాడుల్లో ఇదొకటని రష్యా మీడియా కథనాలు పేర్కొన్నాయి.
మరోవైపు క్రిమియాపైనా ఉక్రెయిన్ భారీ దాడులు కొనసాగించింది. రష్యా సైనిక సరఫరాలు, విద్యుత్ వ్యవస్థలను దెబ్బతీయడమే లక్ష్యంగా తాజా దాడులు చేసినట్లు తెలుస్తోంది.
క్రిమియాలోని క్షిపణి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఇదే సమయంలో తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని పలు ప్రాంతాలపై రష్యా డ్రోన్ దాడులు చేసింది.
ఈ దాడుల్లో అనేక నివాస గృహాలు, దుకాణాలు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.