అదనపు మానవతా సాయం కోరుతూ మోదీకి లేఖ రాసిన జెలెన్‌స్కీ
భారతదేశం నుంచి అదనపు మానవతా సహాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ లేఖ రాశారు. ఈ విషయాన్ని బుధవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా ఇటీవల మూడు రోజుల భారత్ పర్యటన సందర్భంగా జెలెన్‌స్కీ లేఖను కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాకాశీ లేఖికి అందజేసినట్లు విదేశాంగ శాఖ ప్రకటనలో వివరించింది. మానవతా సాయంలో భాగంగా మందులు, వైద్య పరికరాలతో సహా ఇతర సాయాలను చేయాలని జపరోవా కోరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది.
సహాయం అందిస్తామని భారత్ హామీ
ఉక్రెయిన్‌కు మెరుగైన మానవతా సహాయం అందిస్తామని భారత్ హామీ ఇచ్చింది. ఇద్దరు విదేశాంగ మంత్రుల సమావేశం తర్వాత, గత ఏడాది సెప్టెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో 'నేటి యుగం యుద్ధం కాదు' అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని సహాయ మంత్రి లేఖి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా తన పర్యటనలో ఎంఈఏ కార్యదర్శి (వెస్ట్) సంజయ్ వర్మతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక ఎజెండాలో ఆర్థిక, రక్షణ, మానవతా సహాయం, పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ సమస్యలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయి.