LOADING...
Russia: రష్యా కీలక చమురు పోర్టుపై ఉక్రెయిన్ దాడి.. ఎగుమతులకు భారీ దెబ్బ
రష్యా కీలక చమురు పోర్టుపై ఉక్రెయిన్ దాడి.. ఎగుమతులకు భారీ దెబ్బ

Russia: రష్యా కీలక చమురు పోర్టుపై ఉక్రెయిన్ దాడి.. ఎగుమతులకు భారీ దెబ్బ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2026
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా చమురు ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఉస్త్-లుగా నౌకాశ్రయంపై ఉక్రెయిన్ డ్రోన్లు వరుస దాడులు కొనసాగిస్తున్నాయి. వారంక్రితం జరిగిన దాడిలో ఈ పోర్టు కొంత మేర దెబ్బతినడంతో ఇప్పటికే ఎగుమతులు నిలిచిపోయాయి. తాజాగా ఆదివారం మరోసారి ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి జరగగా ఈ విషయాన్ని లెనిన్‌గ్రాడ్ ప్రాంతం గవర్నర్ ధ్రువీకరించారు. ఈ దాడిలో మొత్తం 31 డ్రోన్లను కూల్చివేశామని తెలిపారు. బాల్టిక్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ పోర్టు రష్యా చమురు ఎగుమతులకు అత్యంత కీలకం. ఇదే ప్రాంతంలోని ప్రిమోర్స్క్ పోర్ట్ కూడా ఇటీవల ఉక్రెయిన్ దాడులతో తీవ్రంగా దెబ్బతింది. సముద్ర మార్గంలో రష్యా చేసే చమురు ఎగుమతుల్లో దాదాపు 45శాతం వరకు ఈ ప్రాంత పోర్టుల నుంచే జరుగుతాయి.

వివరాలు

రోజుకు సుమారు 1.72 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి

ముఖ్యంగా ఉస్త్-లుగా పోర్టు నుంచి రోజుకు సుమారు 1.72 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని రష్యా తన లోటు బడ్జెట్‌ను పూరించుకునే అవకాశాన్ని పొందింది. అయితే తాజా డ్రోన్ దాడులతో రష్యా చమురు ఆదాయంపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ రష్యా ఇంధన రంగాన్నే ప్రధాన లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోంది. ఈ నెలలోనే పలు ఇంధన సంస్థలపై 10 భారీ దాడులు జరిపింది. గత వారం సర్టోవ్ ప్రాంతంలోని భారీ చమురు శుద్ధి కర్మాగారంపై కూడా డ్రోన్ దాడి చేసింది.

వివరాలు

రష్యాపై తీవ్ర స్థాయి దాడులు

ఇటీవల వోలోదిమిర్ జెలెన్‌స్కీ అమెరికా మీడియా సంస్థ సీఎన్‌ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తమ దీర్ఘ శ్రేణి డ్రోన్లు రష్యాపై తీవ్ర స్థాయి దాడులు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు. మొత్తంగా, ఈ తాజా దాడులు రష్యా చమురు ఎగుమతులపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉండటంతో పాటు, ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా దాని ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement