
Ukraine: ఉక్రెయిన్‌లో తొలిసారిగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు.. ఎందుకంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ అవినీతి నిరోధక సంస్థల ప్రభావాన్ని తగ్గించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆయన తీసుకున్న చర్యల నేపథ్యంలో దేశ రాజధాని కీవ్‌లో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఇటీవల జెలెన్‌స్కీ, దేశంలోని యాంటీ కరప్షన్ వ్యవస్థను బలహీనపరిచేలా రూపొందించిన ఓ చట్టానికి సంతకం చేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన విమర్శలకు దారితీసింది. ఈ కొత్త చట్టం ప్రకారం,ఉక్రెయిన్‌లోని నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో (నాబు)స్పెషలైజ్డ్ యాంటీ కరప్షన్ ప్రాసిక్యూషన్స్ ఆఫీస్ (సోపా)లను ప్రాసిక్యూటర్ జనరల్ అధీనంలోకి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ,ఈ నిర్ణయం రష్యా దురుద్దేశాలను అడ్డుకునేందుకు తీసుకున్నదని పేర్కొన్నారు.
వివరాలు
చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, వేల సంఖ్యలో ప్రజలు కీవ్ వీధుల్లోకి..
ప్రస్తుతం అవినీతిని ఎదుర్కొనడంలో ఈ సంస్థల పనితీరు తక్కువగానే ఉందని వ్యాఖ్యానిస్తూ, "చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినైనా శిక్షించాల్సిన బాధ్యత ప్రాసిక్యూటర్ జనరల్‌దే" అన్నారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, వేల సంఖ్యలో ప్రజలు కీవ్ వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో ఆందోళనలు చేశారు. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత,ఇదే తొలిసారిగా ఈ స్థాయిలో నిరసనలు చోటుచేసుకున్నాయి. కేవలం కీవ్ మాత్రమే కాకుండా, ల్వివ్, డెనిప్రో, ఒడెసా నగరాల్లోనూ ప్రజలు ప్రదర్శనలకు దిగారు.
వివరాలు
మేము ఐరోపా విలువలను ఎంచుకున్నాం, ఒక నియంత పాలనను కాదు
ఈ నేపథ్యంలో బీబీసీతో ఓ ఆందోళనకారుడు మాట్లాడుతూ, "మేము ఐరోపా విలువలను ఎంచుకున్నాం, ఒక నియంత పాలనను కాదు. మా తండ్రి ఈ స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేశారు. ఆయన త్యాగం వృథా కావాలి అనుకోవడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశాడు. గత దశాబ్ద కాలంగా ఉక్రెయిన్ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని, అవినీతి వ్యతిరేక పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చిన తరుణంలో ఈ చట్టం వాటిని కుంచించేసే ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు. ఇతరులు అభిప్రాయపడుతున్నట్లు,పశ్చిమ దేశాలతో సంబంధాలు మెరుగుపడటానికి, సహాయక నిధులు అందిపుచ్చుకోవడానికీ, ఉక్రెయిన్‌లో ఉన్న బలమైన అవినీతి వ్యతిరేక వ్యవస్థే ప్రధాన కారణంగా ఉంది. కానీ తాజా పరిణామాలు ఆ భరోసాను దెబ్బతీశాయని ఐరోపా కమిషన్ ప్రతినిధి గిల్లామ్ మెర్సియర్ ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాలు
ప్రస్తుతం ఉక్రెయిన్ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా రుస్లాన్ క్రావ్చెంకో
ప్రస్తుతం ఉక్రెయిన్ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అత్యంత నమ్మకస్థుడిగా గుర్తింపు పొందిన రుస్లాన్ క్రావ్చెంకో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నూతన చట్టం ప్రకారం, నాబు వ్యవస్థలోని రష్యా అనుచరులపై ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసు మరియు ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తనిఖీలు చేసి, అవసరమైతే అరెస్టులు చేయవచ్చు. అయితే ఇది అధికార దుర్వినియోగానికి దారితీసే ప్రమాదం ఉందని పశ్చిమ దేశాలు ఇప్పటికే తమ ఆందోళనలను వ్యక్తం చేశాయి.