LOADING...
Russia: రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్‌ డ్రోన్లు.. 'హైవే ఆఫ్ డెత్'గా మారిన ఆర్-280!
రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్‌ డ్రోన్లు.. 'హైవే ఆఫ్ డెత్'గా మారిన ఆర్-280!

Russia: రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్‌ డ్రోన్లు.. 'హైవే ఆఫ్ డెత్'గా మారిన ఆర్-280!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2026
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా రాజధాని మాస్కోకు ఉక్రెయిన్‌ వరుస డ్రోన్‌ దాడులతో తీవ్ర తలనొప్పిగా మారింది. ఈ దాడుల కారణంగా రాజధాని నగరం ఎప్పుడైనా మంటల్లో చిక్కుకునే పరిస్థితి ఏర్పడిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధాన్ని నేరుగా రష్యా గుండెకాయ అయిన మాస్కో వరకు తీసుకెళ్లడంలో కీవ్‌ విజయవంతమైంది. మరోవైపు రష్యా ఆక్రమణలో ఉన్న క్రిమియాకు ప్రధాన భూభాగం నుంచి ఇంధనం, సైనిక సామగ్రి, ఇతర సరఫరాలు చేరకుండా ఉక్రెయిన్‌ లక్ష్యబద్ధంగా చర్యలు చేపడుతోంది. దీంతో యుద్ధ ప్రభావం ఇప్పుడు రష్యాపైనే తీవ్రంగా పడుతోంది. ప్రపంచంలో అత్యధిక చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో టాప్‌-3లో ఉన్న రష్యా సైతం దేశీయంగా ఇంధన కొరతను ఎదుర్కొనే పరిస్థితికి చేరుకుంది.

వివరాలు

మియాకు వెళ్లే ప్రధాన రహదారిని ఆర్‌-280గా పిలుస్తారు

రష్యాలోని రోస్టవ్‌-ఆన్‌-డాన్‌ నగరం నుంచి ఆక్రమిత మారియపోల్‌, మెలిటోపోల్‌ మీదుగా క్రిమియాకు వెళ్లే ప్రధాన రహదారిని ఆర్‌-280గా పిలుస్తారు. ఈ మార్గం ద్వారానే రష్యా సైనిక దళాలు, ఇంధనం, ఆయుధాలు, ఇతర సరఫరాలు ఆక్రమిత ప్రాంతాలకు చేరుతున్నాయి. కెర్చి వంతెనపై దాడులు పెరగడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఈ హైవేను క్రెమ్లిన్‌ వ్యూహకర్తలు వినియోగించడం ప్రారంభించారు. ఈ వ్యూహాన్ని గుర్తించిన ఉక్రెయిన్‌ సైన్యంలోని 412 నెమిసోవ్‌ బ్రిగేడ్‌ (గ్రీకు పురాణాల్లో ప్రతీకార దేవత పేరు)కు చెందిన అన్‌మ్యాన్డ్‌ సిస్టమ్స్‌ ఫోర్స్‌ అమెరికా తయారీ హార్నెట్‌ డ్రోన్లు, స్థానికంగా అభివృద్ధి చేసిన మోరిగన్‌ డ్రోన్లతో భారీ దాడులు నిర్వహించింది.

వివరాలు

ఈ మార్గంలో ప్రయాణించేందుకు భయపడుతున్న సైనిక వాహనాలు

ఈ దాడుల ప్రభావంతో ఆర్‌-280 మార్గంలో ట్రాఫిక్‌ 70 శాతం కంటే ఎక్కువగా తగ్గిపోయింది. ట్యాంకర్లు, సైనిక వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించేందుకు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఒక హైవేను డ్రోన్‌ దాడులతో దాదాపు నిర్మానుష్యంగా మార్చేయడం గమనార్హంగా మారింది. ఇక ఉక్రెయిన్‌ ఎఫ్‌పీ-2, బెహెమోత్‌ వంటి మధ్య శ్రేణి డ్రోన్లను కూడా వినియోగిస్తోంది. ఇవి 50 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ డ్రోన్ల వినియోగం పెరగడంతో రష్యాపై మధ్య శ్రేణి దాడులు గత ఏడాదితో పోలిస్తే 28 రెట్లు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇవి కేవలం సరఫరా వ్యవస్థలనే కాకుండా రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలపై కూడా ప్రభావం చూపుతున్నాయి.

Advertisement

వివరాలు

చమురు క్షేత్రాలు, రిఫైనరీలే ప్రధాన లక్ష్యం

2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 2026 ఏప్రిల్‌ చివరి వారం వరకు ఉక్రెయిన్‌ దళాలు రష్యా ఇంధన రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుని మొత్తం 158 దాడులు నిర్వహించాయి. రష్యాలోని అతిపెద్ద 33 రిఫైనరీల్లో కనీసం 24 రిఫైనరీలు ఈ దాడులకు గురయ్యాయి. ర్యాజన్‌, సరటోవ్‌ రిఫైనరీలపై దాదాపు 15 చొప్పున దాడులు జరగగా, సిజ్రాన్‌ రిఫైనరీపై మే నెలాఖరుకు 11వసారి దాడి జరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు మాత్రమే 16 చమురు శుద్ధి కర్మాగారాలు ఉక్రెయిన్‌ దాడుల్లో దెబ్బతిన్నాయి. దీని కారణంగా రోజుకు సుమారు 7 లక్షల బ్యారెళ్ల రిఫైనింగ్‌ సామర్థ్యం కోల్పోయినట్లు సమాచారం.

Advertisement

వివరాలు

రోజుకు 2.8 మిలియన్‌ బ్యారెళ్లకు పైగా ఉత్పత్తి తగ్గినట్లు సమాచారం

దీంతో రష్యా చమురు శుద్ధి సామర్థ్యం 2009 తర్వాత తొలిసారిగా కనిష్ఠ స్థాయికి పడిపోయింది. జనవరి నుంచి ఇప్పటివరకు 30కి పైగా రిఫైనరీల ఉత్పత్తి దెబ్బతినడంతో రోజుకు 2.8 మిలియన్‌ బ్యారెళ్లకు పైగా ఉత్పత్తి తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌ దాడులు, శుద్ధి సామర్థ్యంలో ఏర్పడిన అంతరాయాల కారణంగా ముడి చమురు ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోయింది. రోజుకు సుమారు 4.6 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి తగ్గిందని పారిస్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది.

వివరాలు

రష్యా సరఫరా వ్యవస్థలనే లక్ష్యంగా చేసుకున్న ఉక్రెయిన్

యుద్ధాల్లో సైన్యానికి మందుగుండు సామగ్రి, ఇంధనం, ఆహారం, ఇతర అవసరమైన సరఫరాలు నిరంతరం చేరడం అత్యంత కీలకం. ఈ సరఫరా వ్యవస్థలు దెబ్బతింటే ఎంత బలమైన సైన్యమైనా కొద్ది వారాల్లోనే బలహీనపడిపోతుంది. ఈ వ్యూహాన్నే ప్రస్తుతం ఉక్రెయిన్‌ రష్యాపై అమలు చేస్తోందని సైనిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. నేరుగా రష్యా దళాలపై దాడులు చేయడం కంటే వారి లాజిస్టిక్స్‌ వ్యవస్థను ఛేదించడంపై కీవ్‌ దృష్టి సారించింది. దేశీయంగా తయారైన మధ్య శ్రేణి డ్రోన్ల సహాయంతో సరిహద్దులకు దూరంగా ఉన్న రష్యా అంతర్గత ప్రాంతాల్లో ఇంధన కాన్వాయ్‌లు, మిలిటరీ ట్రక్కులు, రైళ్లు, ఇతర రవాణా వాహనాలపై దాడులు కొనసాగిస్తోంది.

వివరాలు

ఇప్పటికే 150కి పైగా దాడులు

ముఖ్యంగా క్రిమియాకు వెళ్లే సరఫరా మార్గాలను లక్ష్యంగా చేసుకుని వాటిని తెగదెంపులు చేయడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా విశ్లేషకుల ప్రకారం ఇలాంటి కనీసం 150 దాడులు ఇప్పటికే నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇంధనం తరలిస్తున్న కనీసం 20 రైళ్లను ఉక్రెయిన్‌ ధ్వంసం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. యుద్ధరంగంలో విజయాలు సాధిస్తున్నామని రష్యా ప్రకటిస్తున్నప్పటికీ, ఆ విజయాల కోసం భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఉక్రెయిన్‌ సృష్టిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement