LOADING...
UNO: గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు ఆపాలని ఐరాస తీర్మానం.. భారత్‌ సహప్రాయోజక దేశంగా మద్దతు
భారత్‌ సహప్రాయోజక దేశంగా మద్దతు

UNO: గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు ఆపాలని ఐరాస తీర్మానం.. భారత్‌ సహప్రాయోజక దేశంగా మద్దతు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2026
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌ కలిసి తీవ్ర స్థాయిలో దాడులు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఇరాన్‌ కూడా గల్ఫ్‌ దేశాలపై దాడులు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో టెహ్రాన్‌ వెంటనే ఈ దాడులను నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత్‌ సహప్రాయోజక దేశంగా ఉన్న ఈ తీర్మానానికి చివరికి ఆమోదం లభించింది. బహ్రెయిన్‌ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి మొత్తం 130 దేశాలు కో-స్పాన్సర్లుగా నిలిచాయి. వాటిలో భారత్‌ కూడా ఒకటి. ఇరాన్‌ దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ యుద్ధ పరిస్థితులు ప్రపంచ శాంతి, భద్రతలకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

వివరాలు 

13దేశాలు అనుకూలంగా ఓటు

బహ్రెయిన్‌,కువైట్‌,ఖతార్‌,సౌదీ అరేబియా,యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌,జోర్డాన్‌లపై ఇరాన్‌ చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని ఈ తీర్మానంలో డిమాండ్‌ చేశారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఎవరూ వ్యతిరేకంగా ఓటు వేయలేదు. ఐరాస భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉండగా,వాటిలో 13దేశాలు అనుకూలంగా ఓటు వేయడంతో తీర్మానం ఆమోదం పొందింది. అయితే ఈ ఓటింగ్‌ ప్రక్రియకు ఇరాన్‌కు మిత్రదేశాలుగా భావించే చైనా, రష్యా దూరంగా నిలిచాయి.

వివరాలు 

హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో ఇరాన్‌ చేపట్టిన చర్యలను ఖండించిన ఐరాస 

అంతేకాక హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో ఇరాన్‌ చేపట్టిన చర్యలను కూడా భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. ఇక అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు కీలక అధికారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమోదించిన ఈ తీర్మానంలో ఆ అంశాన్ని ప్రస్తావించకపోవడంపై రష్యా, చైనా తీవ్ర విమర్శలు వ్యక్తం చేశాయి.

Advertisement