UN Security Council: IS-Kని అణచివేసేందుకు ట్రంప్ సర్కారు ప్రాధాన్యం: ఐరాసలో అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్‌లో ఐఎస్‌ఐఎస్ ఖోరసాన్ (ఐసిస్-కే) ఇప్పటికే బలంగా ఉంది అని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా ప్రతినిధి డోరోథీ షియా పేర్కొన్నారు.
ఆమె ఐరాస సమావేశంలో బ్రీఫింగ్ అందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఉగ్రవాద సంస్థ తన చర్యల ద్వారా అంతర్జాతీయ శాంతి, భద్రతకు పెనుముప్పుగా మారింది అని ఆమె అన్నారు.
''ఐసిస్, ఇతర ఉగ్ర సంస్థలను నిర్మూలించడం ట్రంప్ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశాల్లో ఒకటి. ఈ విషయంపై ఆయన చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారు. అమెరికా మరియు దాని మిత్రదేశాలకు ముప్పుగా మారుతున్న ఉగ్రవాదులను కనుగొని, అంతం చేయడం కోసం తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది'' అని ఆమె తెలిపారు.
వివరాలు
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ కేంద్రంగా ఐసిస్-కే
''ఐసిస్-కే సామర్థ్యం పట్ల మేము తీవ్రమైన ఆందోళనలో ఉన్నాం. ఇది ఇప్పటికీ అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తూ కుట్రలు పన్ని దాడులు చేయగలిగే స్థాయిలో ఉంది.
అంతేకాక, కొత్త సభ్యులను నియమించుకుంటూ తమ శక్తిని మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉంది'' అని ఆమె పేర్కొన్నారు.
ఇక సాహిల్ ప్రాంతంలో ఐసిస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ ప్రాంతం ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది.
ఐసిస్ సాహిల్, సోమాలి, వెస్ట్ ఆఫ్రికా విభాగాలు కలిసికట్టుగా ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్నాయి అని ఆమె వివరించారు.
వివరాలు
అఫ్గానిస్థాన్‌లో ప్రధాన ముప్పుగా ఐఎస్‌ఐఎస్-కే
ఐక్యరాజ్యసమితి ఉగ్రనిరోధక విభాగ ప్రతినిధి వ్లాదిమిర్ వొరొనకోవ్ మాట్లాడుతూ, ''ఐఎస్‌ఐఎస్-కే ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో ప్రధాన ముప్పుగా మారింది.ఇది ఐరోపాలో దాడులకు మద్దతు ఇస్తోంది. అంతేకాక, మధ్య ఆసియాలోని దేశాల నుంచి పెద్ద సంఖ్యలో యూత్ రిక్రూట్‌మెంట్ చేపడుతోంది. చిన్న సంఖ్యలో విదేశీ ఉగ్రవాదులు కూడా అఫ్గానిస్థాన్ చేరుకుంటున్నారు'' అని పేర్కొన్నారు.
''ఐఎస్‌ఐఎస్-కే అఫ్గానిస్థాన్‌ను ఉపయోగించి ప్రపంచానికి ముప్పుగా మారకుండా అన్ని దేశాలు కలిసి పనిచేయాలి''అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ విజ్ఞప్తి చేశారని ఆయన తెలిపారు.
కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాలియా జర్మాన్ మాట్లాడుతూ, 2021-22లో ఆమోదించిన దిల్లీ డిక్లరేషన్ గురించి ప్రస్తావించారు.
ఉగ్రవాదులు అధునాతన సాంకేతికతను వినియోగించకుండా అడ్డుకోవడం గురించి ఈ ఒప్పందంలో చర్చించామని ఆమె తెలిపారు.