Trump: అమెరికా-ఇరాన్ చర్చలపై కొనసాగుతున్న అనిశ్చితి .. చమురు నౌకలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు చెందిన వందలాది చమురు నౌకలు అమెరికా వైపునకు ప్రయాణిస్తున్నాయని వెల్లడించారు. తమ చమురును అమెరికా స్వీకరించేలా ఇరాన్ నాయకత్వమే నౌకలపై ఒత్తిడి తీసుకువచ్చిందని తెలిపారు. ఈ నౌకలు టెక్సాస్, లూసియానా, అలాస్కా ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇక ఇరాన్‌తో యుద్ధం జరిగితే అమెరికానే విజయం సాధిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధంపై తప్పుదారి పట్టించే వార్తలు ప్రచారం చేస్తున్న అమెరికా మీడియా సంస్థలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
వివరాలు
చర్చలకు రాకపోతే.. తీవ్ర పరిణామాలు: ట్రంప్
అమెరికా సైనిక చర్యలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని ట్రూత్ సోషల్‌లో మరోసారి పేర్కొన్నారు. యూఎస్ దళాల పనితీరును ప్రశంసించారు. ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ నౌకల రాకపోకలపై దిగ్బంధనం కొనసాగుతుందని తెలిపారు. ఈ దిగ్బంధనంతో ఇరాన్‌కు రోజుకు భారీ ఆర్థిక నష్టం కలుగుతోందని చెప్పారు. ఇదిలా ఉండగా పాకిస్థాన్ వేదికగా ఇరాన్ తమతో చర్చలకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ చర్చలకు ముందుకు రాకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుని తమ దేశ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. అలాగే ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని మరోసారి స్పష్టం చేశారు.