UNESCO warns Pak: తక్షశిల మరమ్మతులుపై వివాదం.. పాకిస్థాన్‌కు యునెస్కో షాక్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని ప్రాచీన పురావస్తు క్షేత్రం తక్షశిలలో ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ పనులపై యునెస్కో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న ఈ చారిత్రక ప్రాంతంలో జరుగుతున్న మార్పులు అసలు నిర్మాణాల ప్రామాణికతను, చారిత్రక విలువను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వెంటనే ఈ పనులను నిలిపివేయకపోతే తక్షశిలను 'వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్' జాబితాలో చేర్చడమే కాకుండా, అవసరమైతే ప్రపంచ వారసత్వ హోదాను కూడా రద్దు చేసే అవకాశముందని పాకిస్థాన్ అధికారులకు స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
వివరాలు
ఐదు శతాబ్దాలకుపైగా చరిత్రను చెప్పే తక్షశిల
పంజాబ్ ప్రావిన్స్‌లోని రావల్పిండి జిల్లాలో ఉన్న తక్షశిల దక్షిణాసియాలో అత్యంత ప్రాచీన బౌద్ధ విద్యా కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మెసోలిథిక్ కాలానికి చెందిన గుహ, నాలుగు ప్రాచీన పట్టణాల శిథిలాలు, బౌద్ధ విహారాలు, మసీదు, మదరసా వంటి అనేక చారిత్రక నిర్మాణాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. భారత ఉపఖండంలో పట్టణ నాగరికత అభివృద్ధికి తక్షశిల ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోందని యునెస్కో పేర్కొంటోంది.
వివరాలు
పర్యాటకుడి ఫిర్యాదుతో వెలుగులోకి..
ఈ ఏడాది మార్చిలో తక్షశిలను సందర్శించిన ఓ పర్యాటకుడు అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించిన ఫొటోలు, వివరాలను ప్యారిస్‌లోని పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి కార్యాలయానికి పంపించాడు. అసలు రాతి గోడలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టడం, పాత గోడల ఎత్తును పెంచడం వంటి చర్యలు చారిత్రక కట్టడాల అసలు స్వరూపాన్ని దెబ్బతీస్తున్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
వివరాలు
సిమెంట్ నిర్మాణాలపై యునెస్కో అసంతృప్తి
ఈ ఫిర్యాదు నేపథ్యంలో జూన్ 12న యునెస్కో ప్రతినిధులు, పాకిస్థాన్ పురావస్తు శాఖ (DOAM), జాతీయ వారసత్వ మంత్రిత్వ శాఖ అధికారులు కలిసి తక్షశిల మ్యూజియం ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మొహ్రా మొరాడు, సిర్కాప్ ప్రాంతాల్లో చేపట్టిన పనులకు సంబంధించిన పూర్తి సాంకేతిక పత్రాలను పంజాబ్ పురావస్తు శాఖ సమర్పించలేకపోయినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రపంచ వారసత్వ కట్టడాల గోడలకు సిమెంట్ వినియోగించడం, పురాతన గోడల స్థానంలో కొత్త రాతి నిర్మాణాలు నిర్మించడం, గోడల ఎత్తును పెంచడం వంటి చర్యలు యునెస్కో మార్గదర్శకాలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. పాత రాళ్లు, కొత్త నిర్మాణ సామగ్రి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని కూడా వారు గుర్తించారు.
వివరాలు
ప్రపంచ వారసత్వ హోదాకు ముప్పు
ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఇలాంటి మార్పులు తీవ్ర నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని యునెస్కో స్పష్టం చేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే తక్షశిలను 'వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్' జాబితాలో చేర్చడంతో పాటు, అవసరమైతే ప్రపంచ వారసత్వ జాబితా నుంచి పూర్తిగా తొలగించే అవకాశమూ ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా ప్రస్తుతం మరో 24 చారిత్రక ప్రాంతాలకు ప్రపంచ వారసత్వ హోదా పొందేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలపై కూడా ఈ వివాదం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
పంజాబ్ పురావస్తు శాఖ స్పందన
యునెస్కో అభ్యంతరాలను పంజాబ్ పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ మాలిక్ జహీర్ అబ్బాస్ ఖండించారు. ప్రస్తుతం జరుగుతున్నవి పునర్నిర్మాణ పనులు కాదని, కేవలం సంరక్షణ చర్యలేనని ఆయన స్పష్టం చేశారు. శిథిలావస్థకు చేరుతున్న నిర్మాణాలను మరింత దెబ్బతినకుండా కాపాడుతూ వాటి అసలు స్వరూపాన్ని సంరక్షించడమే తమ లక్ష్యమని తెలిపారు. చేపట్టిన పనులను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన పేర్కొన్నారు.