Deportation: అమెరికాలో వలసదారులపై కఠిన చర్యలు.. 18,000 మంది భారతీయులకు బహిష్కరణ గండం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో అక్రమ వలసలను అరికట్టే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో బహిష్కరణ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సరైన వలస పత్రాలు లేని దాదాపు 18వేల మంది భారతీయులు కూడా ఈ చర్యల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. బహిష్కరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అమెరికా ప్రభుత్వం సైనిక విమానాలను వినియోగించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో,బహిష్కరణ జాబితాలో ఉన్న పలువురు భారతీయులకు చట్టపరంగా తమ వాదనలు వినిపించుకునే అవకాశాలు చాలా పరిమితంగా ఉండవచ్చని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అప్పీళ్లు దాఖలు చేయడం లేదా న్యాయసహాయం పొందడం కూడా చాలామందికి సాధ్యం కాకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
వివరాలు
డిటెన్షన్ సెంటర్లలో నిర్బంధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు
దేశవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు.
ముఖ్యంగా న్యూయార్క్, టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో చేపడుతున్న తనిఖీలు అక్రమ వలసదారుల జీవన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి.
ఇదే సమయంలో డిటెన్షన్ సెంటర్లలో నిర్బంధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అమానుష ఘటనలకు సంబంధించిన కథనాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
వివరాలు
ఎల్పాసో, కాలిఫోర్నియాలో కొత్త డిటెన్షన్ సెంటర్లు
బహిష్కరణకు గురయ్యే వలసదారులను ఉంచేందుకు ట్రంప్ ప్రభుత్వం ఎల్పాసో, కాలిఫోర్నియాలో రెండు భారీ గిడ్డంగులను కొనుగోలు చేసి వాటిని డిటెన్షన్ సెంటర్లుగా మార్చింది.
ఇందుకోసం సుమారు రూ.16,500కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో దాదాపు 12వేల మంది వలసదారులను ఉంచినట్లు తెలుస్తోంది.
గతంలో బహిష్కరణకు ముందు విచారణలు నిర్వహించే అవకాశం ఉండేదని,ప్రస్తుతం మాత్రం ఐసీఈ దాడుల అనంతరం పలువురిని నేరుగా డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు చెబుతున్నారు.
న్యూయార్క్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ అటార్నీ గ్రెగ్ సిస్కిండ్ మాట్లాడుతూ,తాను మూడు దశాబ్దాలుగా ఇమ్మిగ్రేషన్ కేసులు చూస్తున్నానని,గతంలో ప్రతి వ్యక్తికీ తన కేసును వాదించుకునే అవకాశం లభించేదని చెప్పారు.
వివరాలు
2025లో 3,567 మంది భారతీయుల బహిష్కరణ
అయితే ప్రస్తుతం ఐసీఈ చర్యల తర్వాత చాలా మందిని నేరుగా నిర్బంధ కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
భారత విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, 2025లో అమెరికా నుంచి 3,567 మంది భారతీయులను బహిష్కరించారు.
2026 జూన్ నాటికి మరో 1,076 మంది భారతీయులను స్వదేశానికి పంపించినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
2025 ఫిబ్రవరి 5న అమెరికా తొలిసారిగా 104 మంది భారతీయులను సైనిక విమానం ద్వారా అమృత్‌సర్‌కు తరలించింది.
వివరాలు
భయంతో గడుస్తున్న భారతీయుల జీవితం
అమెరికాలో నివసిస్తున్న పలువురు భారతీయులు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు చెబుతున్నారు.
న్యూయార్క్‌లో నివసిస్తున్న ఓ భారతీయుడు మాట్లాడుతూ, ఇంటి కాలింగ్ బెల్ మోగిన ప్రతిసారి ఐసీఈ అధికారులు వచ్చారేమోనన్న భయం వేస్తోందని తెలిపాడు.
తాను, తన జీవిత భాగస్వామి ఇద్దరూ పట్టుబడితే పిల్లల పరిస్థితి ఏమవుతుందన్న ఆలోచనే ఎక్కువగా వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాలిఫోర్నియాలో నివసిస్తున్న మరో వ్యక్తి మాట్లాడుతూ, గతంలో వాట్సాప్ గ్రూపుల్లో ఉద్యోగాలు, ఇళ్ల అద్దెల గురించి చర్చించేవారమని, ఇప్పుడు మాత్రం దాడులు, చెక్పాయింట్లు, వెళ్లకూడని ప్రాంతాలపై హెచ్చరికలే ఎక్కువగా వస్తున్నాయని చెప్పాడు.
ఏడాదికాలంగా భయాందోళనల మధ్యే జీవిస్తున్నామని పేర్కొన్నాడు.
వివరాలు
చిన్నచిన్న కారణాలకే అధికారులు కొట్టే ఘటనలు
న్యూజెర్సీకి చెందిన మరో వ్యక్తి మాట్లాడుతూ, గత నెల తన పొరుగింటి వ్యక్తితో పాటు అతడి సోదరులను ఐసీఈ అధికారులు అదుపులోకి తీసుకుని టెక్సాస్‌లోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారని తెలిపాడు.
అక్కడ నిర్బంధితులు అమానుష పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే సమాచారం వినిపిస్తోందని, చిన్నచిన్న కారణాలకే అధికారులు కొట్టడం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించాడు.