Bolsonaro: బ్రెజిల్ రాజకీయాల్లో కలకలం.. మాజీ అధ్యక్షుడు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో అరెస్టయ్యారు. తిరుగుబాటు కుట్ర కేసులో ఇప్పటికే ఆయనకు 27 సంవత్సరాల జైలు శిక్ష విధించగా, త్వరలోనే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఫెడరల్ పోలీసులు ముందుగానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం అరెస్టు చేసినట్లు బోల్సొనారో ప్రతినిధి వెల్లడించారు. అనంతరం ఆయనను బ్రెసిలియాలోని ఫెడరల్ పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఫెడరల్ పోలీసులు కూడా దీనిపై స్పందిస్తూ, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామని ఒక ప్రకటనలో తెలిపారు. 2019 నుంచి 2022 వరకు బ్రెజిల్ అధ్యక్షుడిగా సేవలందించిన బోల్సొనారో, 2022 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఎన్నికల ఫలితాలను అంగీకరించేందుకు నిరాకరించడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది.
Details
సుప్రీం ఆదేశాలతో అధికారికంగా అరెస్టు
ఆయన అనుచరులు భారీ సంఖ్యలో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. అధ్యక్ష స్థానంలో ఉండేందుకు తిరుగుబాటు ప్రయత్నాలకు బోల్సొనారో ప్రణాళికలు రచించినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు, ఈ సెప్టెంబర్‌లో ఆయనకు 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విచారణ మొదలైన ఆగస్టు నుంచే బోల్సొనారో గృహనిర్బంధంలో ఉన్నారు. శిక్షపై అప్పీల్ చేసినప్పటికీ ఉపశమనం లభించలేదు. జైలులో ఉండటం ప్రమాదకరమని, ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని బోల్సొనారో తరఫు న్యాయవాదులు వాదించినా కోర్టు పెద్దగా స్పందించలేదు. అందువల్ల గృహనిర్బంధం కొనసాగించాలని చేసిన విజ్ఞప్తి కూడా ఫలించలేదు. ఇప్పుడు సుప్రీం ఆదేశాలతో పోలీసులు ఆయనను అధికారికంగా అరెస్టు చేశారు.