
అమెరికాలో విషాదం.. ఆడుకుంటూ చెల్లిని తుపాకీతో కాల్చిన అక్క
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో గన్ కల్చర్ ఎంత ప్రమాదకరంగా మారిందో చెప్పేందుకు ఈ ఘటన నిదర్శనం.
అభంశుభం తెలియని ఓ మూడేళ్ల బాలిక చేతిలో పోరపాటున పేలిన తుపాకీ, ఏడాది వయస్సు ఉన్న ఆమె సోదరి ప్రాణాన్ని బలిగొంది. ఈ విషాద ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది.
ఇంట్లో గన్ తో ఆటలాడుతూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కడంతో అక్కడే ఆడుకుంటున్న చెల్లి తలలోకి బుల్లెట్ దుసుకెళ్లింది.
సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని బుల్లెట్ గాయంతో రక్తపుమడుగులో విలవిలాడుతున్న ఏడాది చిన్నారిని ఆస్ప్రతికి తరలించారు.
అయితే అప్పటికే పాప చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు.
Details
ఆస్పత్రికి తరలించే లోపు పాప మృతి
కాలిఫోర్నియాలోని శాన్ డియాగో కౌంటీ ఫాల్ బ్రూక్ లో సోమవారం ఉదయం 7:30గంటలకు ఈ ఘటన జరిగింది.
పాప ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించామని, అయితే ఆస్పత్రికి తరలించేలోగా పాప చనిపోయిందని పోలీసులు వెల్లడించారు.
చిన్నారి చేతికి గన్ ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని శాన్ డియాగో కౌంటీ పోలీసులు తెలిపారు.
అగ్ర దేశమైన అమెరికాలో విపరీతంగా పెరిగిపోయిన గన్ కల్చర్ కారణంగా మరో చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.