USA-Iran: ఇరాన్ వైపు కదిలిన అమెరికా విమాన వాహక నౌక.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్న వేళ, ఇరాన్‌పై చర్యలకు దిగేందుకు అమెరికా సన్నద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే భారీగా అమెరికా సైనిక బలగాలు ఇరాన్ చుట్టూ మోహరించినట్లు సమాచారం. తాజాగా అమెరికాకు చెందిన అత్యాధునిక విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఇరాన్ దిశగా కదిలినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ నౌక మే నెల ప్రారంభం వరకు ఆ ప్రాంతంలోనే మకాం వేయనుందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
వివరాలు
ఇరాన్ పాలకులపై మరింత ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో పశ్చిమాసియాకు యుద్ధ నౌకలు
ఇరాన్ పాలకులపై మరింత ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే పలు యుద్ధ నౌకలను పశ్చిమాసియాకు తరలించారు. అందులో యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక, యూఎస్‌ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్, యూఎస్‌ఎస్ స్ప్రూయాన్స్ తరహా డెస్ట్రాయర్లు, అలాగే యూఎస్‌ఎస్ మిషెల్ మార్ఫీ వంటి శక్తివంతమైన నౌకలు ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడు జెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌ను కూడా పశ్చిమాసియా వైపు తరలించడంతో, అమెరికా ఎప్పుడైనా ఇరాన్‌పై దాడికి దిగుతుందేమోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.
వివరాలు
ఒమన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య పరోక్ష చర్చలు
ఇటీవల వెనెజువెలాపై అమెరికా చేపట్టిన దాడుల్లో కూడా యూఎస్‌ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ విమాన వాహక నౌక నుంచే యుద్ధ విమానాలు పాల్గొన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, ఒమన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు విఫలమైతే సైనిక చర్యలకు దిగుతామని అమెరికా ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో యూఎస్ విమాన వాహక నౌక ఇరాన్ వైపు కదలడం పశ్చిమాసియా అంతటా తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది.