Loading...
US and Iran: ఇరాన్‌తో ఒప్పందానికి అమెరికా ప్రయత్నాలు.. మళ్లీ యుద్ధం తప్పేనా?
ఇరాన్‌తో ఒప్పందానికి అమెరికా ప్రయత్నాలు.. మళ్లీ యుద్ధం తప్పేనా?

US and Iran: ఇరాన్‌తో ఒప్పందానికి అమెరికా ప్రయత్నాలు.. మళ్లీ యుద్ధం తప్పేనా?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి పూర్తిస్థాయి యుద్ధం తలెత్తకుండా తెరవెనుక దౌత్య చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురైన ఎదురుదెబ్బల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిలో కొంత మార్పు సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ తన అణు కార్యక్రమంపై ఒప్పందానికి ముందుకొచ్చి, కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు చర్యలు తీసుకుంటే మరోసారి అమెరికా సైనిక దాడులు జరిగే అవకాశాలు చాలా తక్కువని ఆయన తెలిపారు. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలని తాను భావించడం లేదని కూడా స్పష్టం చేశారు. అలాగని, సైనిక చర్యల అవకాశాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేదు.

వివరాలు 

మధ్యంతర ఎన్నికల ప్రభావం.. ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ సంకేతాలు!

మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమికి ఇరాన్‌తో యుద్ధం కూడా ఒక కారణమని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.

దీనితో తాను ఏకీభవిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ప్రజలు యుద్ధాన్ని ఇష్టపడలేదని అంగీకరించినప్పటికీ.. ఇరాన్‌పై దాడులు చేయాలన్న నిర్ణయాన్ని సమర్థించారు.

మరోవైపు, అమెరికా ప్రజలు తమ నిర్ణయాన్ని వెల్లడించారని, ఇప్పుడు వైట్‌హౌస్ తన వైఖరిని మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు.

ఇరు దేశాల మధ్య ఖతార్ మధ్యవర్తిత్వంతో చర్చలు కొనసాగుతున్నాయి.

ఇరు పక్షాల అభిప్రాయాలకు అనుగుణంగా ఒప్పంద ముసాయిదాలో మార్పులు చేస్తున్నారు.

ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని అమెరికా కోరుతుండగా.. అది తమ సార్వభౌమ హక్కు అని ఇరాన్ వాదిస్తోంది.

వివరాలు 

యురేనియం నిల్వలపై అమెరికా పట్టు.. ఆంక్షల ఎత్తివేతకు ఇరాన్ డిమాండ్

ఇరాన్ వద్ద వందల కిలోల శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నట్లు సమాచారం.

వాటిని ఇతర దేశాలకు తరలించడం లేదా వాటి శుద్ధి స్థాయిని తగ్గించడం ద్వారా అణ్వాయుధాల తయారీకి అవకాశం లేకుండా చేయాలని అమెరికా భావిస్తోంది.

మరోవైపు, అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలని, విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కోరుతోంది.

యుద్ధంలో తమ దేశ సుప్రీం నేత అలీ ఖమేనీ, కీలక సైనికాధికారులు హతమైనందుకు పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తోంది.

యుద్ధాన్ని అన్ని ప్రాంతాల్లో ముగించడంతో పాటు సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని పట్టుబడుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

యుద్ధ ముప్పు ఇంకా తొలగలేదు

అయితే,ఇరు దేశాల మధ్య పరస్పర నమ్మకం లేకపోవడం ఒప్పందానికి ప్రధాన అడ్డంకిగా మారింది.

హార్ముజ్ జలసంధిని తెరిచి,యురేనియం నిల్వలపై నియంత్రణ వదులుకున్న తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేస్తాయనే భయం ఇరాన్‌లో ఉంది.

మరోవైపు, ఇరాన్ డిమాండ్లు ఆమోదయోగ్యం కావని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, అమెరికా మధ్యప్రాచ్యంలో భారీగా సైనిక బలగాలను కొనసాగిస్తోంది.

ఇరాన్ అణు కార్యక్రమంపై సమాచారం ఇచ్చేవారికి 2 కోట్ల డాలర్ల వరకు బహుమతి ప్రకటించింది.

మరోవైపు, ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులు, లెబనాన్, ఇరాక్‌లోని మిత్ర బలగాల అంశం కూడా చర్చల్లో కీలకంగా మారింది.

దీంతో దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, మరోసారి పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యే ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు.

ADVERTISEMENT