LOADING...
US-Iran war: పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇరాన్‌ చమురుపై అమెరికా మరిన్ని ఆంక్షలు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇరాన్‌ చమురుపై అమెరికా మరిన్ని ఆంక్షలు

US-Iran war: పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇరాన్‌ చమురుపై అమెరికా మరిన్ని ఆంక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 16, 2026
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో ప్రపంచం ఇంధన సంక్షోభం వైపు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ చమురుపై మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. టెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అమెరికా ఖజానా శాఖ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఈ ఆంక్షలను ప్రకటించారు. ఇటీవల ఇరాన్‌,రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించిన కొన్ని ఆంక్షలను అమెరికా సడలించింది. అయితే ఆ సడలింపును ఇకపై కొనసాగించబోమని బెసెంట్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ చమురు ఎగుమతులతో సంబంధాలు కలిగిన పలువురు వ్యక్తులు,చమురు సంస్థలు,నౌకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రెజరీ శాఖకు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం వెల్లడించింది.

వివరాలు 

హర్మూజ్‌ జలసంధి వద్ద ఇరాన్‌ నౌకల రాకపోకలను నియంత్రిస్తున్న అమెరికా

ఆంక్షలకు గురైన సంస్థలు ఇరాన్‌ మాజీ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ రాజకీయ సలహాదారుడి కుమారుడు మహమ్మద్‌ హుస్సేన్‌ షమ్‌ఖానీ ఆధ్వర్యంలో నడుస్తున్నవని తెలిపింది. ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో అలీ ఖమేనీ సలహాదారు మరణించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో హర్మూజ్‌ జలసంధి వద్ద ఇరాన్‌ నౌకల రాకపోకలను అమెరికా నియంత్రిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. దీంతో ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి మరింత పెరగనున్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో చమురుపై అదనపు ఆంక్షలు విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే, ఇరాన్‌ ఆర్థిక లావాదేవీలకు చైనా బ్యాంకులు సహకరిస్తున్నట్లు గుర్తిస్తే వాటిపైనా ద్వితీయ ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని బెసెంట్‌ హెచ్చరించారు.

వివరాలు 

పెట్రో రసాయన ఎగుమతులకు ఇరాన్‌ బ్రేక్

తాజా ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పెట్రో రసాయన ఎగుమతులను నిలిపివేయాలని ఆ దేశ జాతీయ పెట్రోరసాయన సంస్థ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో శత్రు దాడుల వల్ల కలిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకొని దేశీయ పరిశ్రమలు, వినియోగదారుల అవసరాలను ముందుగా తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఎగుమతికి పంపి విదేశాలకు చేరని సరుకును కూడా తిరిగి దేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement